ప్రధాని 3 రోజుల రాష్ట్ర పర్యటన
సాక్షి, చైన్నె: ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాట మూడు రోజులు పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తులలో రాష్ట్ర బీజేపీ వర్గాలు నిమగ్నమయ్యాయి. రామేశ్వరం వేదికగా సంక్రాంతి వేడుకకు సన్నాహాలు మొదలెట్టారు. వివరాలు.. తమిళనాడులో ఈసారిడీఎంకే పతనంతో ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రావాల్సిందే అన్న లక్ష్యంతో బీజేపీ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర,జాతీయ నాయకులు సమన్వయంతో వ్యూహాలను రచిస్తూ , అమలు చేస్తూ వస్తున్నారు. ఒక ప్రతి నెలా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటుగా ముఖ్య నేతలు తమిళనాట పర్యటించేవ విధంగా కార్యాచరణ సిద్ధంచేస్తున్నారు. ఓ వైపు అన్నాడీఎంకే, బీజేపీ ఎన్‌డీఏ కూటమిని బలోపేతం చేసే దిశగా వ్యూహాలు రచిస్తూనే, మరో వైపు డీఎంకే వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా సోమవారం కేంద్రహోంమంత్రి అమిత్‌షా సైతం చైన్నెకు రానున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితులలో ప్రదాని నరేంద్ర మోదీ సైతం తమిళనాట ఏకంగా మూడు రోజులు పర్యటించే దిశగా కార్యక్రమాల కసరత్తు జరుగుతోంది.
రామేశ్వరంలో సంక్రాంతి వేడుక
గత నెల పీఎం మోదీ కోయంబత్తూరులోపర్యటించారు. ఇది పూర్తిగా రైతు కార్యక్రమంగా జరిగింది. తాజాగా అదే రైతుల మన్ననలు పొందే విధంగా సంక్రాంతి సంబరాలు సైతం తమిళనాట జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు. గత ఏడాది సంక్రాంతి(పొంగల్)ను తమిళ సంప్రదాయ బద్దంగా ఢిల్లీలో జరుపుకున్నారు. ఈసారి ఏకంగా రైతుల సమక్షంలో పూర్తిగా తాను కూడా తమిళాభిమాని అను చాటుకునే విధంగా పొంగల్ వేడుకలను రామేశ్వరం వేదికగా జరుపుకునే కార్యాచరణలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈనెల 13,14,15 తేదీలలోదక్షిణ తమిళనాడును గురి పెట్టి మోదీ పర్యటనకు రాష్ట్ర బీజేపీ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. కాశీ తమిళ సంగమంముగింపు వేడుకలతో పాటూ పొంగల్ వేడుకను రామనాధపురం జిల్లా రామేశ్వరం వేదికగా 14వ తేదిన జరుపుకునేందుకు సంబంధించిన ఏర్పాట్ల కసరత్తులలో బీజేపీ వర్గాలు నిమగ్నమై ఉండటం గమనార్హం.


