అశోక్ సెల్వన్ తాజా చిత్ర షూటింగ్ పూర్తి
తమిళసినిమా: నటుడు అశోక్ సెల్వన్, నిమిష సజయన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ పూర్తి అయినట్లు యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఇంతకుముందు గుడ్ నైట్, లవర్, టూరిస్ట్ ఫ్యామిలీ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మిలియన్ డాలర్ స్టూడియోస్ సంస్థ అధినేత యువరాజ్ గణేషన్, వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ అధినేత ఐసరి గణేష్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా మణికంఠన్ ఆనందన్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నారు. మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ ఇది రొమాంటిక్ థ్రిల్లర్ కథాచిత్రంగా ఉంటుందన్నారు. నటుడు అశోక్ సెల్వన్ ఇప్పటివరకు నటించిన చిత్రాలన్నింటికంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ఇది అని చెప్పారు. చిత్రంలోని అధిక సన్నివేశాలను రాత్రుల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని తెలిపారు. త్వరలోనే చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్ పోస్టర్లు విడుదల చేస్తామని చెప్పారు. కాగా ఈ చిత్రానికి దీపు నినన్ థామస్ సంగీతాన్ని, పుష్పరాజ్ సంతోష్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
నటి నిమిష సజయన్, అశోక్ సెల్వన్


