యాదవులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి
తిరుత్తణి: యాదవులు వెనుకబాటు తనం పోయి.. వారి జీవన ప్రమానాలు మెరుగుపడేందుకు వెనుకబడిన వర్గాల జాబితాలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని గోకుల ప్రజా పార్టీ సమావేశంలో డిమాండ్ చేశారు.ఈ మేరకు తిరువళ్లూరులో 22న ధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. గోకుల ప్రజా పార్టీ, యాదవుల సంఘం సంయుక్తంగా తిరుత్తణిలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో తిరువళ్లూరు జిల్లావ్యాప్తంగా ఉన్న యాదవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోకుల ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శేఖర్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో కోటికి పైబడిన యాదవులు విద్య,ఉపాధి, ఆర్ధికంగా ఎదుగుదల లేకపోవడంతో పేదరికంలో రెండు దశాబ్దాలుగా కష్టపడుతున్నట్లు తెలిపారు. వెనుకబడిన వర్గాల జాబితాలో యాదవులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ధర్నా చేపడుతున్నట్లు, వచ్చే 22న తిరువళ్లూరు జిల్లా కేంద్రంగా ధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. యాదవ మహభాసభ నాయకులు త్యారాజన్, రామకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.


