నేటి నుంచి జరిమానా
సాక్షి,చైన్నె :పెంపుడు జంతువులకు లైసెన్సుల మంజూరు ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. సోమవారం నుంచి జరిమానను వడ్డించేందుకు చైన్నెకార్పొరేషన్ వర్గాలు సిద్ధమయ్యాయి. వివరాలు.. అనేక మంది శునకాలు, పిల్లులు తదితర వాటిని పెంచుకోవడం చైన్నెలో అధికంగా ఉన్న విషయం తెలిసిందే. వీటిని బయటకు తీసుకొచ్చే క్రమంలో సమస్యలు తప్పడం లేదు. కొన్ని చోట్ల శునకాలు దాడి చేసి గాయ పరిచిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ పరిస్థితులలో పెంపుడు జంతువులకు లైసెన్సులు తప్పనిసరి చేస్తూ చైన్నె కార్పొరేషన్ సమావేశంలో తీర్మానం చేశారు. పెంపుడు జంతువులు, వీధులలో తిరిగే సునకాలు, అవి సృష్టించే వీరంగాల గురించి కార్పొరేషన్ తీవ్రంగా పరిగణించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీధులలో తిరిగే శునకాలను కట్టడిచేసేందుకు ప్రత్యేకచర్యలు చేపట్టారు. అదే విధంగా పెంపుడు జంతువులకు లైసెన్సులు లేకుంటే రూ. 5 వేలు జరిమాన విధించేందుకు హెచ్చరికలు జారీ చేశారు. పెంపుడు జంతువులకు బయటకు తీసుకొచ్చే క్రమంలో వాటి మెడకు రక్షణ బ్యాడ్జీలు లేకుంటే రూ. 500 జరిమానా విధించేందుకు చర్యలు చేపట్టారు. ఇక, పెంపుడు జంతువులను బహిరంగ ప్రదేశాలకు తీసుకొచ్చి మల, మూత్ర విసర్జన చేయించినా చర్యలు తప్పదని హెచ్చరించారు. అలాగే, లైసెన్సులను తప్పని సరిచేశారు. పెంపుడు జంతువులను కలిగిన వారు లైసెన్సులు తీసుకునేందుకు వీలుగా చైన్నెలో శిబిరాలను నిర్వహించారు.
చైన్నెలో లక్షా 98 వేల మేరకు పెంపుడు జంతువులు ఉన్నట్టు పరిశీలనలో తేల్చారు. అయితే ఇందులో 50 శాతం మంది మాత్రమే లైసెన్సులు పొందిఉన్నారు. ఇప్పటికే లైసెన్సుల మంజూరు గడువును రెండుసార్లు పొడిగించారు. తాజాగా ఈప్రక్రియను ఆదివారంతో ముగించారు. ఇక, సోమవారం నుంచి ఇంటింటా పరిశీలన చేపట్టనున్నారు. పెంపుడు జంతువులకు లైసెన్సులు పొందని యజమానులకు రూ. 5 వేలు జరిమానా విధించే దిశగా అధికారులు కసరత్తులు చేపట్టి ఉండడం గమనార్హం. తాజాగా జరపనున్న పరిశీలనలో లైసెన్సులు లేని వారికి జరిమానా విధించేనా లేదా మరోసారి అవకాశం కల్పించేనా? అన్నది వేచిచూడాల్సిందే.


