మంత్రి పదవి ఇస్తామన్నా పోటీ చేయను!
– తిరునావుక్కరసర్ స్పష్టీకరణ
సాక్షి, చైన్నె: తనకు మంత్రి పదవి ఇస్తామన్నా.. తాను మాత్రం అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయబోనని కాంగ్రెస్ సీనియర్ నేత తిరునావుక్కరసర్ వ్యాఖ్యానించారు. అయితే ఆయన మంత్రి పదవి వ్యాఖ్య చర్చకు దారి తీసింది. అధికారంలో ఈసారి వాటా దిశగా కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారాలు వెలువడ్డ విషయం తెలిసిందే. కొందరు నేతలు అయితే, డీఎంకే నుంచి అధిక సీట్లు రాబట్టుకోవాలని, అధికారంలో వాటా కోరాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ సీనియర్ నేత తిరునావుక్కరసర్ మీడియతో ఆదివారం మాట్లాడుతూ, తాను పలు సార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లానని, దివంగత నేత ఎంజీఆర్ హయంలో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశానని గుర్తు చేశారు. తాజాగా తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పినా, తాను మాత్రం అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. తాను ఎంపీ పదవికి మాత్రమే పోటీ చేస్తానని, అసెంబ్లీకి పోటీ చేయాలన్న ఆలోచన, ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. అయితే, అధికారంలో వాటా చర్చ నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఇచ్చినా? అంటూ తిరునావుక్కరసర్ వ్యాఖ్యలు చేయడం బట్టి చూస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వాటా కోరుతున్నదన్న చర్చలకు బలం చేకూరినట్లయ్యింది.
వందేమాతరం గీతానికి 150 ఏళ్లు
–రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలకు ప్రకటన
కొరుక్కుపేట: వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తమిళనాడులో చదువుతున్న పాఠశాల, కళాశాల విద్యార్థులు పాఠశాల వ్యాస రచన పోటీలు నిర్వహించనున్నట్లు తమిళనాడు గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. గవర్నర్ కార్యాలయం శనివారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ఇలా పేర్కొంది. పాఠశాల, కాలేజీ విద్యార్థులకు వేర్వేరు పోటీలు , పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇంగ్లీష్ పోటీలు నిర్వహిస్తామని, పాఠశాల విద్యార్థుల కోసం, భారత స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతరం పాట సహకారం, వందేమాతరం పాటతో భారతాన్ని మేల్కొలపడం అనే అంశాలపై వ్యాసాలు గరిష్టంగా 10 పేజీలు (ప్రతి పేజీకి 20 పంక్తులు, మొత్తం 1,500 నుంచి 2,000 పదాలు) ఉండాలి. వ్యాసాలను చైన్నెలోని గవర్నర్ కార్యాలయంకు పంపించాలి. ప్రతి విభాగంలో మొదటి బహుమతి విజేతకు రూ. 50,000 బహుమతిని అందజేస్తుంది. రెండవ బహుమతి విజేతకు రూ. 30,000, మూడవ బహుమతి విజేతకు రూ. 25,000 బహుమతిని అందజేస్తామని పేర్కొంది.
నైజీరియా యువకుడి అరెస్ట్
తిరువొత్తియూరు: మాదక ద్రవ్యాల కేసులో నైజీరియా యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులో మాదక ద్రవ్యాలను పట్టుకునేందుకు ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేశారు. తిరువళ్లూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వివేకానంద శుక్లా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక బృందం తమిళనాడు అంతటా మాదక ద్రవ్యాల కేసులోని నేరస్థులపై నిఘా పెట్టారు. ఈకేసులో సెప్టెంబర్ నెలలో నామక్కల్‌లో వస్త్ర వ్యాపారం చేస్తున్న నైజీరియా దేశానికి చెందిన మైఖేల్ నవాసా నమ్డి, చైన్నెలో నివసిస్తున్న కాంగో దేశానికి చెందిన కబితా యానిక్ తిషింబోలను అరెస్ట్ చేశారు. విచారణలో డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా నాయకుడిగా వ్యవహరించిన సెనెగల్‌కు చెందిన బెండేను ఢిల్లీలో పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ ముఠాకు డబ్బు లావాదేవీలో పాల్గొన్న ఈరోడ్‌లో నైజీరియాకు చెందిన ఇగ్బియాని మైఖేల్ (44)ను ఆదివారం అరెస్ట్ చేశారు.


