కోలాహలంగా ఉడాన్ ఉత్సవ్
సాక్షి, చైన్నె : ముక్తి– ఎంఎస్ దాదా ఫౌండేషన్ ఉడాన్ ఉత్సవ్ చైన్నె వేదికగా శనివారం రాత్రి కోలాహలంగా జరిగింది. హారింగ్టన్ రోడ్డులోని లేడీ ఆండాల్ స్కూల్‌లోని సర్ ముత్త వెంకట సుబ్బారావు ఆడిటోరియం వేదికగా వేడుకలు జరిగాయి. నిర్వాహకులు మీనా దాధా, శివకుమార్ గోయాంకా బృందం ముక్తి కార్యక్రమానికి ఇందులో నాయకత్వం వహించారు. గౌరవం, సాధికార, సామాజిక బాధ్యతను చాటే విధంగా వేడుకలను పారంభించారు.ముంబైకు చెందిన మహిళా సంగీత బృందం నేతృత్వంలో ప్రపథమంగా విభావరిని నిర్వహించారు. శక్తివంతమైన ప్రదర్శనలు,సంగీతాన్ని బలోపేతం చేసే విధంగా, సామాజికతను చాటే రీతిలో ఈ విభావరి జరిగింది. కర్ణాటక బ్యాంక్ చైర్మన్ ప్రదీప్‌కుమార్ పంజాలతో పాటూ పలువురు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సేవ చేసే ప్రతి వ్యక్తికి గౌరవం, చైతన్యం, విశ్వాసాన్ని పునరుద్దరించడమే లక్ష్యంగా ఈ ఉత్సవ్ జరుపుకున్నారు. సంగీతాన్ని మాత్రమే కాకుండా, సాధికారత, సమ్మిళితత్వం, దాతృత్వ స్ఫూర్తిని చాటే విధంగా ముందుకు సాగారు. హోటల్ సవేరా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ నీనారెడ్డిని ఈ ఉత్సవ్‌లో ఘనంగా సత్కరించారు. ఉడాన్ ఉత్సవ్ సావనీరును ఆవిష్కరించారు.


