రూ.1.31కోట్ల నగదు, 15 సవర్ల నగలు మోసం
● ఇద్దరు మహిళల అరెస్టు
తిరువళ్లూరు: వ్యాపారంలో పెట్టుబడి పెడితే పెద్ద ఎత్తున ఆధాయం వస్తుందని నమ్మించి మహిళ వద్ద కోటి 31 లక్షల రూపాయల నగదు, 15 సవర్ల బంగారు నగలు మోసం చేసిన వ్యవహరంలో అక్కాచెల్లి తదితర ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు పరారీలో వున్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చైన్నె పోరూర్ రామకృష్ణనగర్ ప్రాంతానికి చెందిన రాజరాజన్ భార్య మాలతి(42). ఈమె చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. మాలతి స్నేహితురాలైన గూడువాంజేరి ప్రాంతానికి చెందిన పరమేష్ భార్య సంగీతతో దాదాపు 10 ఏళ్ల నుంచి సంబందాలు ఉన్నాయి. ఈ క్రమంలో మాలతి వద్దకు వెళ్ళిన సంగీత ఆమె సోదరి కవితతో పాటు సంగీత ఆడపడుచు భర్త భాస్కరన్ తదితర ముగ్గురు కలిసి తాము వేర్వేరు వ్యాపారాలు చేస్తున్నామని, అందులో పెట్టుబడి పెడితే భారీగా ఆదాయం వస్తుందని నమ్మించి మాలతి వద్ద కోటి 31 లక్షల రూపాయలు, 15 సవర్ల బంగారు నగలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం మాలతి వద్ద తీసుకున్న నగదును తిరిగి ఇవ్వకపోగా, బెదిరింపులకు దిగడంతో బాధితురాలు ఆవడి పోలీసు కమిషనర్ శంకర్‌కు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో మాలతి వద్ద బంగారు నగలు, నగదు తీసుకుని సంగీత, కవిత తదితర ఇద్దరూ మోసం చేసినట్టు నిర్దారించి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


