ఐపీఎస్ ఇషా సింగ్‌కు ప్రశంసలు
సాక్షి, చైన్నె: టీవీకే అధినేత విజయ్ బహిరంగ సభకు కట్టుదిట్టమైన భద్రత ఇచ్చి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు ఇవ్వకుండా దూకుడుగా ముందుకు సాగిన మహిళా ఐపీఎస్ ఇషా సింగ్‌ను ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నమశ్శివాయం, డీజీపీ షాలిని సింగ్ ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం విజయ్ పుదుచ్చేరిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఉప్పలం వేదికగా జరిగిన బహిరంగ సభకు నిర్ణీత సంఖ్యకంటే అత్యధికంగా జనం తరలి వచ్చినా, వారిని కట్టడి చేసి గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించడం, ఆ పరిసరాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత కల్పన బాధ్యతలన్నీ ఐపీఎస్ అధికారిని ఇషా సింగ్‌కు అప్పగించారు. ఆమె చాకచక్యంగా వ్యవహరించారు. ఓ సందర్భంగా గుర్తింపు కార్డులు లేని వారిని కూడా టీవీకే వర్గాలు లోనికి అనుమతించడంతో వారిపై తీవ్రస్థాయిలో ఆమె విరుచుకు పడ్డ వీడియో వైరల్ అయింది. తుపాకీతో వచ్చిన మాజీ సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని సైతం పట్టుకున్నారు. ఇక తమకు కల్పించిన భద్రతపై విజయ్ సైతం పదేపదే అభినందనలు, ధన్యావాదులు తెలియజేశారు. ఈ పరిస్థితులలో గురువారం ఇషా సింగ్‌ను హోంశాఖ మంత్రి నమశ్శివాయం , డీజీపీ షాలిని సత్కరించి, ప్రశంసా పత్రం అందజేశారు. విధి నిర్వహణలో ఆమె అంకిత భావాన్ని ప్రత్యేకంగా అభినందించారు.


