ఇంటింటికీ వెళ్లండి..!
న్యూస్‌రీల్
ఇంటింటా వెళ్లండి.. ద్రావిడ మోడల్ ప్రభుత్వ ప్రగతిని ప్రజలలోకి తీసుకెళ్లండి అని నేతలకు డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశించారు. గురువారం స్టాలిన్ అన్నా అరివాలయంలో బిజిబిజీగా ఎన్నికల పనుల కసరత్తులలో నిమగ్నమయ్యారు.
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల కసరత్తులలో భాగంగా సోదరా కదిలిరా నినాదంతో నియోజకవర్గాల వారీగా నేతలతో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలలో నియోజకవర్గాల వారీగా సేకరించిన సమాచారాల ఆధారంగా, అక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తూ, పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా కార్యక్రమాలను స్టాలిన్ విస్తృతం చేయిస్తూ వస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల విషయంలో నాయకులకు అక్షింతలు, మందలింపు, హెచ్చరికలు ఇచ్చిన సందర్భాలు అనేకం. గతంలో ఓడిన స్థానాన్ని ఈ సారి చేజిక్కించుకోవాల్సిందేనంటూ నేతలకు అల్టిమేటం ఇస్తున్నారు. ఓడితే పదవులు ఊడుద్దన్న హెచ్చరికలు ఇస్తున్నారు. ఈ పరిస్థితులలో గురువారం తేనాంపేటలోని డీఎంకే కార్యాలయంలో అన్నా అరివాలయంలో ఎన్నికల పనుల కసరత్తులలో స్టాలిన్ బిజి బిజీ అయ్యారు. కాంగేయం, తారాపురం తదితర నియోజకవర్గాల నేతలతో సోదరా కదిలిరా నినాదం మేరకు సమావేశమయ్యారు. అక్కడి పరిస్థితులను స్టాలిన్ అధ్యయనం చేశారు. విజయపు బావుటా ఎగుర వేయాలంటే మరింతగా శ్రమించాలని, ద్రావిడ మోడల్ ప్రగతిని ప్రజలలోకి ఇంటింటా తీసుకెళ్లాలని, విస్తృతంగా పర్యటనలకు సన్నద్దం కావాలని ఆదేశించారు. మళ్లీ అధికారం దిశగా దూసుకెళ్దామని, ఇంటింటా ఉరకలు తీద్దామని పిలుపునిచ్చారు.
డీఎంకేలోకి సెల్వ కుమార్..
టీవీకే అధినేత విజయ్ సన్నిహితుడు, మాజీ మేనేజర్, పులి చిత్ర సహ నిర్మాత, కల్పయ్ పీపుల్స్ మూమెంట్ నాయకుడు పిటీ సెల్వకుమార్ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. విజయ్‌కు అత్యంత సన్నిహితులలో ఒకరుగా సెల్వకుమార్ మెలిగే వారు. ఆయన అభిమాన సమూహాన్ని గతంలో ఆయన చూసుకునే వారు. ఈప రిస్థితులలో ఇటీవల అన్నాడీఎంకే నుంచి డీఎంకేలో చేరి మనోజ్ పాండియన్‌తో కలిసి హఠాత్తుగా ఆయన తన మద్దతుదారులతో డీఎంకేలో చేరడం చర్చకు దారి తీసింది. మీడియాతో మాట్లాడిన సెల్వకుమార్ టీవీకేలో విజయ్ అభిమానులకు గుర్తింపు లేదని ఆరోపించారు. అభిమానంతో దూసుకొచ్చిన వారిని పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారిని విజయ్ అందలం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్‌కే కాదు, ఏ ఒక్క నిజమైన అభిమానికీ టీవీకేలో కనీస గుర్తింపు, గౌరవం లేదన్నారు. అభిమానులే ముఖ్యం అని విజయ్ చెప్పుకుంటున్నా, అక్కడ జరుగుతున్నదని మరొకటి అని మండి పడ్డారు.
డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌తో సీపీఐ నేతలు అన్నా అరివాయలంలో సమావేశమయ్యారు. గత వారం కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికలు, పొత్తుల కసరత్తుల కమిటీ స్టాలిన్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. తమకు కావాల్సిన సీట్ల వివరాలతో ఓ జాబితాను అందజేసి వెళ్లారు. ఈ పరిస్థితులలో తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీర పాండియన్, మాజీ కార్యదర్శి ముత్తరసన్‌తో పాటుగా ముఖ్య నేతలు స్టాలిన్‌తో అన్నా అరివాయలంలో సమావేశమయ్యారు. సుమారు అర్ధగంటకు పైగా ఈ భేటి జరిగింది. ఇందులో సీపీఐ ఆశిస్తున్న సీట్లకు సంబంధించిన చర్చ జరిగినట్టు సమాచారం. అదే సమయంలో సీపీఐ శతాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఇందులో స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరు గురించి, ఇందు కోసం సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేసేందుకే సీపీఐ నేతలు అన్నా అరివాలయం వెళ్లినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
సీపీఐ నేతల భేటీ
కమిటీ..
కూటమిలోని పార్టీలు సీట్ల పందేరంపై దృష్టి పెడుతున్న నేపథ్యంలో స్టాలిన్ అందుకు అనుగుణంగా అడుగులు వేయడానికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా డీఎంకే తరపున ప్రత్యేక కమిటీని రంగంలోకి దించేందుకు నిర్ణయించారు. పార్టీ నేతలు టీఆర్‌బాలు, నెహ్రు, తంగం తెన్నరసు, ఆర్‌ఎస్ భారతీ, టీకేఎస్ ఇలంగోవన్‌తో కూడిన కమిటీ ఏర్పాటుకు కసరత్తులు జరుగుతున్నాయి. కూటమి పార్టీలతో ఈ నెలాఖరులో లేదా జనవరి మొదటి వారం నుంచి ఈ కమిటీ చర్చలు జరపనుంది. ఇదిలా ఉండగా, డీఎంకే ప్రభుత్వం మహిళలను ఆకర్షించే విధంగా, వారి ఓటు బ్యాంక్‌పై గురి పెట్టి శుక్రవారం నుంచి కలైంజ్ఞర్ మహిళా హక్కు పథకం విస్తరణకు సిద్ధమైంది. మరో 15 లక్షల మందికి రూ. 1000 నగదు పంపిణీ పథకాన్ని సీఎంప్రారంభించడమే కాకుండా, తమిళ మహిళల విజయ పర్వం పేరిట ప్రత్యేక కార్యక్రమానికి సన్నద్ధం కావడం గమనార్హం.
ఇంటింటికీ వెళ్లండి..!
ఇంటింటికీ వెళ్లండి..!


