మహాకవికి ఘన నివాళులు
సాక్షి, చైన్నె: మహాకవి భారతియార్ 144వ జయంతి వేడుకలు గురువారం రాష్ట్రంలో ఘనంగా జరిగాయి. వాడవాడలా ఆయన చిత్ర పటాలకు, విగ్రహాలకు పూల మాలలు వేసి రాజకీయ పక్షాలు, సంఘాలు, సంస్థల ప్రతినిధులు నివాళులర్పించాయి. పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. వివరాలు.. తన సాహిత్యంతో తమిళుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహాకవి సుబ్రహ్మణ్య భారతియార్. ఈయనకు జాతీయ స్థాయిలో తాజా గుర్తింపు ఉంది. అంతే కాదు, ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో భారతియార్ పేరును తప్పని సరిగా ఉచ్చరించడం జరుగుతోంది. ఈ పరిస్థితులలో గురువారం భారతియార్ జయంతి కావడంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వేడుకలు జరిగాయి. మహాకవికి నివాళులర్పించే విధంగా చిత్రపటాలకు పూల మాలలు వేశారు. పుష్పాంజలి ఘటించారు. మహాకవి వేషధారణల్లో విద్యార్థులు అలరించారు. ఆయన సాహిత్యం, రచనల్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయ పక్షాలు, తమిళ సంఘాలు, సంస్థల నేతృత్వంలోనూ వాడ వాడల్లో వేడుకలు జరిగాయి. ట్రిప్లికేన్‌లో ఉన్న ఆ మహాకవి జీవించిన గృహంలోని విగ్రహానికి పలువురు నివాళులర్పించారు. ముందుగా గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆ గృహానికి చేరుకుని భారతియార్‌కు నివాళుర్పించి, అక్కడి ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఇక్కడి ఆయన విగ్రహానికి, చిత్ర పటానికి గవర్నర్ ఆర్‌ఎన్ రవితో పాటూ అఽధికారులు అంజలి ఘటించారు. ఈసందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో భారతియార్ విగ్రహాన్ని ఉంచి ఊరేగించారు. గవర్నర్ ఆర్‌ఎన్ రవి, మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తదితరులు పల్లకిని మోశారు. ముందుగా రాజ్ భవన్‌లోని భారతియార్ స్మారకం వద్ద గవర్నర్ పుష్పాంజలి ఘటించారు. ఇక మెరీనా బీచ్ రోడ్డులోని మహాకవి విగ్రహం పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ పార్టీలకు అతీతంగా నాయకులు, సంఘాల ప్రతినిధులు తరలి వచ్చి నివాళులర్పించాయి. అక్కడ ఉంచిన భారతీయార్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించాయి. రాష్ట్ర మంత్రులు స్వామినాథన్, శేఖర్‌బాబు, మేయర్ ప్రియ, డిప్యూటీ మేయర్ మహేశ్‌కుమార్ తదితరులు నివాళులర్పించారు. అనంతరం తమిళ మానిల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జిఆర్ వెంకటేష్, ఉపాధ్యక్షుడు మన్వర్ భాషా పుష్పాంజలి ఘటించారు.
మహాకవికి ఘన నివాళులు


