హోరాహోరీగా జూనియర్ హాకీ వరల్డ్ కప్ ఫైనల్
సాక్షి,చైన్నె: పురుషుల హాకీ జూనియర్ ప్రపంచ కప్ 2025 ఫైనల్ చైన్నెలో హోరాహోరీగా సాగింది. ఈపోటీలో విజేతగా జర్మన్ జట్టు నిలిచింది. ఈ జట్టుకు డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్‌ట్రోఫీని ప్రదానం చేశారు. వివరాలు.. దేశంలోనే క్రీడలకు రాజధానిగా తమిళనాడును తీర్చిదిద్దేవిధంగా ద్రావిడ మోడల్ ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. వివిధ జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వేదికగా చైన్నెను ఎంపిక చేస్తూ వస్తున్నారు. 2024లో ఆసియన్‌పురుషుల హాకీ ఛాంపియన్ ట్రోఫీని తమిళనాడు ప్రభుత్వం విజయవంతం చేయడంతో ఈ సారి 14వ పురుషుల హాకీ జూనియర్ ప్రపంచ కప్ పోటీలకు చైన్నె, మదురైలను వేదికగా ఎంపిక చేశారు. చైన్నెలో ఇది వరకే మేయర్ రాధాకృష్ణన్ హాకీ స్టేడియం ఉండగా, మదురైలో కొత్తగా స్టేడియంను నిర్మించారు. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు పోటీలు జరిగాయి. భారతదేశంతో హాకీ జట్టుతో పాటుగా చైనా, మలేషియా, జపాన్, జర్మనీ, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, అర్జెంటీనాతో సహా 24 దేశాల జట్టులు ఇక్కడిపోటీలలో పాల్గొన్నాయి. చైన్నె ఎగ్మూర్‌లోని మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో ఫైనల్స్ బుధవారం రాత్రి జర్మనీ, స్పెయిన్ మధ్య హోరాహోరీగా జరిగింది. పురుషుల హాకీ జూనియర్ ప్రపంచ కప్‘ ఫైనల్ విజేతగా జర్మనీ జట్టు నిలిచింది, రన్నరప్‌గా స్పెయిన్ నిలిచింది. ఫైనల్ విజేత జర్మన్ జట్టు సభ్యులకు బంగారు పతకాలు, జట్టుకు ట్రోఫీని క్రీడలశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ అందజేశారు. రెండవ స్థానంలో నిలిచిన స్పెయిన్ జట్టు సభ్యులకు రజత పతకం, మూడో స్థానంలో నిలిచిన భారత ఆటగాళ్లకు కాంస్య పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిహార్ క్రీడల మంత్రి శ్రేయసి సింగ్, ఎమ్మెల్యే ఇ. పరంధామన్, క్రీడల శాఖ కార్యదర్శి డాక్టర్ అతుల్య మిశ్రా, తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి జె. మేఘనాథడ్డి, హాకీ సమాఖ్య అధ్యక్షుడు దాతుక్ దయాబ్ ఇక్రమ్, హాకీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టర్కి, సెక్రటరీ భోలానాథ్ సింగ్, కోశాధికారి శేఖర్ జె. మనోహరన్, డైరెక్టర్ (జనరల్) కమాండర్ ఆర్.కె. శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.


