ముగిసిన ‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియ
రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ దరఖాస్తుల పర్వం, స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఈ పనులు వంద శాతం విజయవంతంగా పూర్తయినట్లు ఎన్నికల కమిషన్ ప్రక్రటించింది. ఈనెల 16న మాదిరి ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. అదే సమయంలో ఎన్నికల పనులను వేగవంతం చేస్తూ గురువారం నుంచి ఆయా జిల్లాలు, డివిజన్లు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు, వీవీ పాడ్, కంట్రోల్ ప్యానల్స్ పరిశీలన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ(ఎస్‌ఐఆర్) నవంబర్ 4వ తేదీ నుంచి డిసెంబరు 4వ తేదీ వరకు జరిగింది. డీఎంకే కూటమితో పాటూ టీవీకే ఈ ప్రక్రియను ఆది నుంచి వ్యతిరేకించడమే కాకుండా, ఆందోళనలు సైతం చేపట్టింది. మరోవైపు బీఎల్‌ఓలు పోరాట బాట పట్టడంతో పూర్తిచేసిన దరఖాస్తులను సమర్పించడంలో కష్టాలు, నష్టాలు తప్పలేదు. పూర్తి చేసిన దరఖాస్తులను గురువారం వరకు స్వీకరించారు. ఈ ప్రక్రియను సాయంత్రం ఐదు గంటలకు ముగించారు. వంద శాతం తమిళనాడులో ఎస్‌ఐఆర్ పనులు ముగిసినట్టు ప్రకటించారు. వచ్చిన దరఖాస్తులను డిజిటల్ ప్రక్రియ ద్వారా నమోదు చేస్తున్నటుట వివరించారు. 16వ తేదీన మాదిరి జాబితాను ప్రకటించనున్నట్టు వెల్లడించారు. అదే సమయంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ మేరకు తమిళనాడులో సుమారు 70 లక్షల మంది ఓటర్లను తొలగించి ఉన్నారన్న సంకేతాలు రావడం గమనార్హం. ఇక రాష్ట్రంలో పోలింగ్ స్టేషన్ల సంఖ్యను సైతం పెంచారు. 1,200 మందికి పైగా ఓటర్లను కలిగిన పోలింగ్ స్టేషన్లను విభజించి కొత్తగా స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇది వరకు 68,467 పోలింగ్ స్టేషన్లు ఉండగా , తాజాగా 6,568 స్టేషన్లు పెరిగాయి. మొత్తంగా 75,035 పోలింగ్‌స్టేషన్లు రాష్ట్రంలో ఉన్నట్టు గురువారం ప్రకటించారు.
ఈవీఎంల పరిశీలన
గత ఎన్నికలలో ఉపయోగించిన ఈవీఎంలను ఫలితాల లెక్కింపు తదురి ఆయా జిల్లా కేంద్రాలలోని ప్రత్యేక గదులలో భద్ర పరిచారు. వీటిని తాజాగా పరిశీలించే పనులలో నిమగ్నమయ్యారు. గతంలో ఉన్న వివరాలు, సమాచారాలన్నీ చెరిపి వేసి వాటిని కొత్తగా ఉపయోగించే రీతిలో తీర్చిదిద్దే పనులు చేపట్టారు. మొత్తంగా ఒక లక్షా 30 వేల ఈవీఎంలను సిద్ధం చేస్తున్నారు. వీటీ పాడ్‌లను, కంట్రోల్ ప్యానెల్స్‌లను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో రాజకీయ పక్షాల సమయంలో ఈ ప్రక్రియ జనవరి 24 వతేదీ వరకు జరగనున్నది. ఈ ప్రక్రియ రోజూ ఉదయం 8.45 నుంచి రాత్రి 7 గంటల వరకు జరుగుతుంది. ఈపనులు జరిగే సమయంలో సిబ్బంది, రాజకీయ పక్షాలు తప్పని సరిగా గది లోపలే ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇక, చైన్నెలోని 16 నియోజకవర్గాలకు చెందిన 6 వేల ఈవీఎంలను పరిశీలించే పనులను కార్పొరేషన్ కమిషనర్, ఎన్నికల అధికారి కుమగురుబరన్ పరిశీలించారు. చైన్నెలో ఈప్రక్రియ జరుగుతున్న ప్రదేశంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు ఇంకా దరఖాస్తు చేసుకోని వారు ఈ నెల 14లోపు తమ వినతులను సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
పరిశీలిస్తున్న కమిషనర్ కుమర గురుబరన్
ముగిసిన ‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియ


