దివికేగిన సినీ సౌమ్యుడు
సినిమాలను చాలా మంది నిర్మిస్తారు. చాలా మంది స్టూడియోలను నిర్వహిస్తారు. అయితే అందులో సార్థక నామధేయులు అతి కొద్దిమందే ఉంటారు. అలాంటి వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతారు. అలా నిర్మాతగా భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయే సినీ నిర్మాత ఏవీఎం శరవణన్. సినిమానే లోకంగా , సినిమానే జీవితంగా జీవించిన గొప్ప వ్యక్తి ఈయన. ప్రఖ్యాత దివంగత నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధినేత ఏవీ.మెయ్యప్పన్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఏవీఎం.శరవణన్ గురువారం వేకువ జామున ఈ లోకాన్ని వీడారు. అయితే ఆయన పేరు మాత్రం సినీ చరిత్ర పుటలో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
తమిళసినిమా: 18 ఏళ్ల వయసులోనే తండ్రి ఏవీ.మెయ్యపన్ అడుగు జాడల్లో నడిచి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించారు ఏవీఎం.శరవణన్. ఆ తర్వాత పట్టిందల్లా బంగారం అయ్యింది. ఈక్రమంలో తండ్రి పేరును నిలబెట్టే చిత్రాలను నిర్మించారు. ఈయన నిర్మించిన చిత్రాలన్నీ దాదాపు విజయం సాఽధించాయి. అలా ఏవీఎం ప్రొడక్షన్స్ సంస్థకు భారత సినీ చరిత్రలో ఒక విశిష్ట స్థానం లభించింది. ఎంజీఆర్, శివాజీగణేశన్, ఏఎన్‌ఆర్, జెమినీగణేశ్ వంటి ప్రఖ్యాత నటులతో చిత్రాలను నిర్మించిన నిర్మాణ సంస్థ ఇది. పరాశక్తి వంటి సమకాలీన రాజకీయ కథాంశంతో కూడిన చిత్రం ద్వారా నటుడు శివాజీగణేశన్‌ను పరిచయం చేసింది ఈ సంస్థనే. ఆ చిత్రానికి దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి సంభాషణలు రాయడం విశేషం. అలాంటి సంస్థ లెగసీని కాపాడుకుంటూ వచ్చిన నిర్మాత ఏవీఎం.శరవణన్. 1970 నుంచి నిర్మాతగా తన ప్రస్ధానాన్ని ప్రారంభించిన ఈయన తొలి ప్రయత్రంలోనే రజనీకాంత్ కథానాయకుడిగా మురట్టు కాళై చిత్రాన్ని నిర్మించి ఘన విజయాన్ని అందుకున్నారు. అలా రజనీకాంత్, కమలహాసన్, విజయకాంత్, అర్జున్ ,విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలతో చిత్రాలు చేసి విజయాలను అందుకున్నారు.
సౌమ్యుడిగా..
చిత్ర పరిశ్రమలో అజాతశత్రువుగా పేరు గాంచిన ఏవీఎం శరవణన్ సహృదయుడు, నిగర్వి, నిడారంబరుడు, వినమృడుగా పేరుగాంచారు. ఎక్కడికి వెళ్లినా రెండు చేతులు కట్టుకుని మాట్లాడే వ్యక్తి ఏవీఎం శరవణన్. ఎప్పుడూ తెల్లని దుస్తులు ధరించి తన మనసు అంత స్వచ్ఛమైనదని నిరూపించుకున్న వ్యక్తిగా ప్రశంసలు అందుకున్న నిర్మాత ఏవీఎం.శరవణన్. ఈయన సినీ పరిశ్రమలో ఏలాంటి వేడుకకై నా హాజరై, అభినందించే మనసున్న మనిషి ఆయన. కాగా ఏవీఎం శరవణన్ మరణం భారతీయ సినిమాకు తీరని లోటు. ఆయన భౌతిక కాయానికి ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్, మంత్రి ఎం.బాలసుబ్రమణ్యం, ఎండీఎంకే పార్టీ నేత వైగో, నటుడు శివకుమార్, సూర్య, విశాల్, పార్తీపన్, గీత ర చయిత వైరముత్తు, వైజీ.మహేంద్ర మొదలగు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఏవీఎం.శరవణన్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి స్టాలిన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తమిళ సినిమాలోని ప్రఖ్యాతి గాంచిన వారిలో ఏవీఎం.శరవణన్ ఒకరు అన్నారు. తమిళసినిమాలో వెన్నుముకగా చరిత్రకెక్కిన స్టూడియోల్లో ఏవీఎం స్టూడియో ఒకటిగా వెలుగొందిందన్నారు. తమిళసినిమా దశ, దిశలను నిర్ణయించిన వారిలో ఏవీఎం.ఽశరవణన్ ఒకరిని పేర్కొన్నారు. ఒక తండ్రిగాను, సినిమాలో ఖ్యాతి గఢించి, అందరూ అప్పాచ్చి అని గౌరవించిన ఏవీ.మెయప్పన్ గౌరవాన్ని పెంచిన కొడుకు శరవణన్ అని పేర్కొన్నారు. ప్రశాంతత, నిరాడంబరత సంప్రదాయంగా భావించే వ్యక్తి ఆయన అన్నారు. అన్నాడీఎంకే ఎడపాడి పళనిస్వామి తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ తమిళ సినిమాలో ప్రేమాభిమానాలు కలిగిన ఏవీఎం.శరవణన్ మరణం తీరని లోటు అన్నారు. ఇండియా సినిమాలో అత్యత్తుమ చిత్ర నిర్మాణ సంస్థ ఏవీఎం. ప్రొడక్షన్స్ అని మంత్రి స్వామినాథన్ ఎక్స్ మీడియాలో పేర్నొన్నారు. ఆ సంస్థ మేనేజింగ్ భాగస్వామి ఏవీఎం.శరవణన్ మృతి చెందిన వార్త వేదనను కలిగించిందన్నారు. స్వచ్ఛత, నిజాయితీ, ప్రశాంతతకు చిరునామా ఏవీఎం.శరవణన్ అని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం ఎక్స్ మీడియాలో పేర్కొన్నారు. తమిళసినిమాలో పలు ప్రయోగాలకు కారణం ఏవీఎం శరవణన్ అని, ఆయన పలువురు సినీ కళాకారులను పరిచయం చేశారని అన్బురామదాస్ పేర్కొన్నారు. సినిమా రంగంలోకి వచ్చే వారు ఏవీఎం స్టూడియో వెళ్లాలి, ఏవీఎం శరవణన్‌ను కలవాలి అని అశపడతారు. మీ పేరు చెప్పుకునే పిల్లల్లో ఒకడినని తాను ఒకడినని కమలహాసన్ పేర్కొన్నారు. నివాళి అర్పించిన అనంతరం నటుడు శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. తన పేరును మార్చి సినీ జీవితాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి శరవణన్ అని తెలిపారు. నటుడు రజనీకాంత్ కూడా నివాళులు అర్పించారు. తమిళ సినిమాకే కాకుండా ఇండియన్ సినిమాకే గుర్తింపు ఏవీఎం శరవణన్ అని నటుడు విశాల్ పేర్కొన్నారు. కాగా ఏవీఎం శరవణన్ భౌతిక కాయానికి గురువారం సాయంత్రం ఏవీఎం స్టూడియోలో అంత్యక్రియలు నిర్వహించారు.
దివికేగిన సినీ సౌమ్యుడు
దివికేగిన సినీ సౌమ్యుడు
దివికేగిన సినీ సౌమ్యుడు


