ఇండిగో సేవల రద్దు
● చైన్నె, మదురైలలో ప్రయాణికుల అవస్థలు
సాక్షి, చైన్నె: ఇండిగో విమాన సేవల రద్దుతో గురువారం చైన్నె, మదురైలోని ప్రయాణికులు విమానాశ్రయాలలో తీవ్ర అవస్థలను ఎదుర్కొన్నారు. మొత్తం 39 విమానాలు చైన్నె నుంచి, ఆరు విమానాలు మదురై నుంచి రద్దు అయ్యాయి. సాంకేతిక సమస్య పేరిట బుధవారం దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాలు అనేకం రద్దయ్యాయి. ఈ పరిస్థితులలో సిబ్బంది కొరత తదితర అంశాలతో చైన్నె నుంచి వివిధ నగరాలకు బయలు దేరాల్సిన విమాన సేవలను క్యాన్సిల్ చేశారు. మొత్తంగా 12 గంటలలో 39 విమాన సేవలు రద్దు అయ్యాయి. ముందుగా రిజర్వు చేసుకున్న ప్రయాణికులు అనేక మంది విమానాశ్రయాలకు చేరుకుని ఇండిగో సిబ్బంది వద్ద వాదులాటకు దిగడంతో ఉత్కంఠ నెలకొంది. తమకు సరైన సమాచారం అన్నది ఇవ్వ లేదంటూ ప్రయాణికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి మదురై, తిరుచ్చి విమానాశ్రయాలలో సైతం నెలకొన్నాయి. మదురై నుంచి ఆరు విమాన సేవలు రద్దు అయ్యాయి. తిరుచ్చి నుంచి సింగపూర్ బయలుదేరాల్సిన విమాన సేవలను నిలుపుదల చేశారు. విమానాల రద్దుతో ప్రయాణికుల అవస్థలు అంతా ఇంతా కాదు. అత్యవసరంగా వెళ్లాల్సిన వాళ్లు ఇతర విమానాలలో టికెట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హెచ్‌ఐటీఎస్‌లో ఏఐ, గ్లోబల్ ప్రోగ్రామ్
సాక్షి, చైన్నె : హిందూస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్( హెచ్ ఐటీఎస్)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్లోబల్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించారు. 2026–27 విద్యా సంవత్సరంలో ఈ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియపై దృష్టి పెట్టారు. జెన్ ఏఐ, క్లౌడ్ సెక్యూరిటీ, హెల్త్‌కేర్ మేనేజ్ మెం, లిబరల్ స్టడీస్‌లలో ఈ కొత్త ప్రోగ్రామ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారతీయ, అంతర్జాతీయ విద్యార్థులు ఇద్దరికీ ఈ కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. ఈ విషయంపై ఆ విద్యా సంస్థ చాన్స్‌లర్ డాక్టర్ ఆనంద్‌జాకబ్ వర్గీస్ మాట్లాడుతూ, గూగుల్ సహకారంతో జెన్ ఏఐ, క్లౌడ్ సెక్యూరిటీలో స్పెషలైజేషన్‌తో బీ టెక్ సీఎస్‌ఈ, బీఎస్సీ ఎకనామిక్స అండ్ ఫైనాన్స్, బీఎస్సీ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్‌రిలేషన్స్, బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్, బీఎస్సీ క్యాటరింగ్, ప్రాంచైజ్ మేనేజ్ మెంట్‌స్పెషలైజేషన్‌తో బీబీఏ, ఎగ్జిక్యూటీవ్ ఎంబీఏ కోర్సులు ఉన్నట్టు వివరించారు. ఈ కోర్సుల దరఖాస్తుకు ఫిజిక్స్, కెమిస్ట్రి, మ్యాథమెటిక్స్‌లో కనీసం 60 శాతం మార్కులు తప్పని సరిగా ప్రకటించారు. హెచ్‌ఐటీఎస్‌ఈఈఈ 2026కి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది ఏప్రిల్ 22వ తేదీగా పేర్కొన్నారు. ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు ప్రవేశ పరీక్ష, మే 13 నుంచి 20 వరకు కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. అలాగే, హెచ్‌ఐటీఎస్‌సీఏటీ 2026 ప్రవేశ దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 10 నుంచి ప్రారంభం అవుతుందన్నారు.
శ్రీలంక తమిళులకుకేటాయించిన నిధుల్లో గోల్‌మాల్
కొరుక్కుపేట: శ్రీలంక తమిళులకు రుణాల కోసం కేటాయించిన నిధులను గోల్‌మాల్ చేసిన మాజీ తహశీల్దార్ సహా ఐదుగురికి జైలు శిక్ష విధించారు. వివరాలు.. 1994–1996 కాలంలో శివగంగ జిల్లాలోని శ్రీలంక తమిళులకు ఇళ్ల నిర్మాణం కోసం రుణాలు అందించడానికి రూ. 43.50 లక్షలు కేటాయించారు. ఈ మొత్తాన్ని 435 ఇలంగియా థైరాల్‌కు నకిలీ పత్రాలు సృష్టించి మోసపూరితంగా అందించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై శివగంగ అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ చేపట్టారు. అప్పటి దేవకోట్టై ఆర్టీఓగా ఉన్న సయ్యద్ హుస్సేన్, కారైకుడి తహశీల్దార్ సర్దార్, కారైకుడి తాలూకా ఆఫీస్ డిప్యూటీ తహశీల్దార్ ఇబ్రహీం, కళావనివా సాల్ వీఏఓ రామచంద్రన్, శివగంగ కలెక్టరేట్‌లో క్లర్క్‌గా పనిచేసిన ధనశేఖరన్, కాంట్రాక్టర్ కతిరేశన్. శ్రీలంక శరణార్థుల పునరావాస కేంద్రానికి అధిపతిగా ఉన్న ముత్తు ముత్తు, మధురై నగర్‌కు చెందిన పాండియన్, తిరుమంగళం సమీపంలోని మేలక్కోట్టై నివాసి దినేష్ కుమార్ , రామర్ సహా 9 మందిపై కేసు నమోదైంది. ఈ కేసును శివగంగై ప్రత్యేక అవినీతి నిరోధక బ్యూరో ప్రత్యేక కోర్టులో విచారించారు. బుధవారం కేసును విచారించిన న్యాయమూర్తి అనితా క్రిస్టీ, నిందితులైన మాజీ తహశీల్దార్ సర్దార్, కాంట్రాక్టర్ కతిరేసన్, ముత్తుకు 3 సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.30 వేల జరిమానా విధించారు. దినేష్ కుమార్, రామ్‌కు 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పిచ్చారు.


