70 సీట్లకు టీఎన్‌సీసీ పట్టు
సాక్షి, చైన్నె: తమిళనాడు కాంగ్రెస్ తరపున ఏఐసీసీ ప్రతినిదులు డీఎంకే వద్ద 70 సీట్లకు పట్టుబడుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించిన జాబితాను అప్పగించడంతో కాంగ్రెస్ తీరుపై డీఎంకే గుర్రుగా ఉన్నట్టు చర్చ ఊపందుకుంది. వివరాలు.. ఆది నుంచి డీఎంకే కాంగ్రెస్‌ల బంధం గురించి చెప్పనక్కర్లేదు. వీరి బంధం ప్రతి ఎన్నికలలోనూకొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 2026 ఎన్నికలలో డీఎంకే కూటమిలో కాంగ్రెస్ కొనసాగే దిశగానే మొగ్గు చూపుతోంది. ఇందులో భాగంగా తమిళనాడు, పుదుచ్చేరి పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ గిరిష్ చోదనక్కర్, ఏఐసీసీ ప్రతినిధులు సూరజ్ హెగ్డే, నివేదిత్‌ఆళ్వాలు, టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, శాసన సభా పక్ష నేత రాజేష్‌కుమార్ బుధవారం అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం కాంగ్రెస్ ఢిల్లీ ప్రతినిధులు స్టాలిన్‌కు ఓ జాబితాను అందజేసినట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఇది కాస్త డీఎంకే అధినేత స్టాలిన్‌తో పాటూ ఇతర నేతలో ఆగ్రహాన్ని రేపినట్టు సంకేతాలు వెలువడ్డాయి. 70 సీట్లను కాంగ్రెస్ ఆశిస్తూ జాబితాలో వివరాలను పేర్కొనడి ఉండడం ఇందుకు కారణం. ఇందులో ఈరోడ్, మదురై, తూత్తుకుడి, తెన్‌కాశి, తిరునల్వేలి, కన్యాకుమారి, నామక్కల్, అరియలూరు, పెరంబలూరు, కన్యాకుమారి జిల్లాలోని అత్యధిక స్థానాలు ఉన్నట్టు సమాచారం. ఈ స్థానాలన్నీ డీఎంకే సిట్టింగ్‌సీట్లు కావడం గమనార్హం. తమ సిట్టింగ్ సీట్లపై కాంగ్రెస్ కన్నెసి ఉండటాన్ని డీఎంకే వర్గాలు నిశితంగానే పరిశీలిస్తున్నారు. గత ఎన్నికలలో 25 సీట్ల ఇస్తే ఏడు చోట్ల ఓటమి పాలై 18 చోట్ల నెగ్గిన కాంగ్రెస్‌కు ఈసారి 30 లోపు సీట్లే ఇచ్చేందుకు డీఎంకే నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు ససేమిరా అన్న పక్షంలో కాంగ్రెస్‌పై స్టాలిన్ కన్నెర్ర చేసే అవకాశాలు ఉండేనా అన్నది వేచి చూడాల్సిందే.


