అమిత్ షాతో రాజకీయ చర్చ
సాక్షి, చైన్నె: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వం భేటీ అయ్యారు. ఆయనతో రాజకీయ సంబంధిత అంశాల గురించి చర్చించినట్టు పన్నీరు సెల్వం ప్రకటించారు. అన్నాడీఎంకే అధిష్టానానికి పన్నీరు సెల్వం ఈనెల 15వ తేదీ వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. అందరూ ఏకం కాని పక్షంలో కీలక నిర్ణయం తప్పదన్న హెచ్చరికలు చేశారు. ఈ పరిస్థితులలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి తీరుతో సీనియర్ నేత సెంగొట్టయ్యన్ టీవీకేలో చేరిపోయారు. అలాగే టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం సైతం టీవీకేతో పొత్తు ప్రయత్నాలలో ఉన్నట్టు చర్చ ఊపందుకుంది. అన్నాడీఎంకే నుంచి బహిష్కరించ బడ్డ వారందరూ మళ్లీ ఆపార్టీలోకి చేర్చుకునే అవకాశాలు అన్నది తాజాగా కనిపించడం లేదు. అదే సమయంలో పన్నీరు సెల్వం సైతం ఏదేని కీలక నిర్ణయం తీసుకోవచ్చు అన్న చర్చ జరుగుతోంది. పన్నీరు సెల్వంకు దక్షిణ తమిళనాడులోని ముక్కళత్తూరు సామాజిక వర్గం మద్దతు ఉంది. ఇప్పటికే ఈ సామాజిక వర్గం పెద్దఎత్తున డీఎంకే వైపుగా వెళ్లి ఉన్నది. మిగిలిన వారినైనా కాపాడుకోవాలంటే పన్నీరు మద్దతు కీలకంగా ఉంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పన్నీరును బీజేపీ కూటమిలో చేర్చుకునే దిశగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చలలో ఉన్నట్టు సమాచారం వెలువడింది. ఇందుకు అనుగుణంగా పన్నీరును ఢిల్లీకి పిలిపించి గురువారం మాట్లాడడం గమనార్హం. అమిత్‌షాతో భేటీ గురించి పన్నీరు పేర్కొంటూ రాజకీయాలు మాట్లాడుకున్నామని, చర్చించుకున్నామని, అంతా త్వరలో బయటకు వస్తాయంటూ ముందుకు సాగడం గమనార్హం. తాజాగా పన్నీరుకు అమిత్‌షా అభయం ఇచ్చినట్టుగా ప్రచారం ఊపందుకోవడంతో బీజేపీ కూటమిలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళణి స్వామి వర్గీయులకు షాక్‌గా మారినట్లయ్యింది.


