క్లుప్తంగా
ప్రభుత్వ న్యాయవాది దారుణ హత్య
అన్నానగర్: తెన్కాసిలో పట్టపగలు ఒక మర్మమైన వ్యక్తి పబ్లిక్ న్యాయవాది కార్యాలయంలోకి ప్రవేశించి, ఆయనను కత్తితో పొడిచి చంపాడు. తెన్కాసి జిల్లాలోని కడయనల్లూరు సమీపంలోని ఉర్మెల్ అలగియాన్ గ్రామానికి చెందిన ముత్తుకుమారస్వామి (46). సెంగోట్టై కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆయన తెన్కాసి దక్షిణ జిల్లా డీఎంకే న్యాయవాదుల బృందం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఇతని భార్య రసాతి. ఈ దంపతులకు గుణశేఖరన్ (14) అనే కుమారుడు, గుణ శరణ్య (12) అనే కుమార్తె ఉన్నారు. తెన్కాసి సమీపంలోని కూలక్కడై బజార్ ప్రాంతంలోని ఓ భవనంలో ముత్తుకుమారస్వామి ప్రత్యేక కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను ఎప్పటిలాగే కార్యాలయానికి వచ్చి తన పనిని ప్రారంభించాడు. మధ్యాహ్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ముత్తు కుమారస్వామిని కత్తితో నరికి హత్య చేశాడు. ఘటనపై తెన్‌కాసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉర్మెల్ అలగియాన్ గ్రామంలో ముత్తుకుమారస్వామికి, అదే ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులకు మధ్య గతంలో శత్రుత్వం ఉందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా ప్రభుత్వ న్యాయవాది హత్యకు గురైన విషయం తెలుసుకున్న తెన్కాసి ప్రాంతంలో 100 మందికి పైగా న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది.
బైకు ఢీకొని ఆలయ పూజారి మృతి
పళ్లిపట్టు: బైక్ ఢీకొని ఆలయ పూజారి ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పళ్లిపట్టు సమీపంలోని అత్తిమాంజేరిపేటకు చెందిన రత్నవేల్ (51) అత్తిమాంజేరిపేటలోని భారతియార్ నగర్‌లోని వినాయకుడి ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్నారు. అతను బుధవారం ఉదయం ఆలయంలో పూజలు పూర్తిచేసుకుని అమ్మయార్‌కుప్పంలో కొత్తగా నిర్మించిన ఇంటికి వెళ్లుతుండగా పళ్ళిపట్టు ఆర్కేపేట రాష్ట్ర రహదారిలోని కోరకుప్పం వద్ద తన ఎలక్ట్రిక్ బైకులో వెళ్లుతుండగా వెనుక వైపు వెగంగా వచ్చిన గుర్తు తెలియని బైక్ ఢీకొంది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన రత్నవేల్‌ను అక్కడున్న వారు కాపాడి 108 ఆంబులన్స్ సాయంతో ఆర్కేపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చైన్నెలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రత్నవేల్ మృతి చెందారు. పొదటూరుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
హత్యకేసులో నిందితుడి ఆత్మహత్య
తిరువొత్తియూరు: తూత్తుకుడి జిల్లాలో తండ్రి హత్య కేసులో అరెస్టయ్యి బెయిల్‌పై విడుదలైన ఉపాధ్యాయుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా కడంబూరు అగ్రహార వీధికి చెందిన అశ్వత్ కుమార్ ( 33) ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు. అతని భార్య 2023 నవంబర్‌లో విడిపోయి కీళకూట్టుపన్నైలో ఉన్న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఘటన జరిగిన రోజు మామగారి ఇంటికి భార్యను పిలవడానికి కత్తితో అశ్వత్ కుమార్ వెళ్లి అక్కడ వస్తువులను ధ్వంసం చేశాడు. అప్పుడు అక్కడికి వెళ్లిన అశ్వత్ కుమార్ తండ్రి దశరథన్ తన కొడుకును మందలించాడు. దీంతో కోపోద్రిక్తుడైన అశ్వత్ కుమార్ తండ్రి అని చూడకుండా దశరథన్‌ను హత్య చేసి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఈ కేసులో గత 2 నెలల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చిన అశ్వత్ కుమార్ జీవితంపై విరక్తి చెంది, ఇంటి మేడపై ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కడంబూరు పోలీసులు సంఘటనా స్థలానికి కెళ్లి అశ్వత్ కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి విచారణ చేస్తున్నారు.
ఖననం చేసిన విద్యార్థి మృతదేహం మాయం
తిరువొత్తియూరు: తిరువిడై మరుదూరు సమీపం పందనల్లూరు సమీపం అరసడి గ్రామానికి చెందిన విద్యార్థిని దర్శిక ( 10). ఆమె గత 2 రోజుల క్రితం అనారోగ్యంతో అక్కడి ఆసుపత్రిలో చేరింది. ఈ స్థితిలో అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీని తరువాత బుధవారం సాయంత్రం దర్శిక మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులు బంధువులు అంత్యక్రియలు చేసి మణియారు నది ఒడ్డున ఉన్న ఇడుకాడు శ్మశానంలో ఖననం చేశారు. ఆ తర్వాత గురువారం ఉదయం కర్మకాండలు చేయడానికి దర్శిక కుటుంబ సభ్యులు మరియు బంధువులు ఇడుకాడు (శ్మశానం)కు వెళ్లారు. అప్పుడు ఖననం చేసిన ప్రదేశం నుంచి విద్యార్థిని మృతదేహం తవ్వి తీసి ఉండడంతో దిగ్భ్రాంతి చెందారు. విషయం తెలుసుకున్న పందనల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. ఇంకా విద్యార్థిని మృతదేహాన్ని ఎవరైనా మాంత్రికులు తీసుకువెళ్లారా? లేదా మరేదైనా కారణమా? అనే వివిధ కోణాలలో పోలీసులు విచారణ చేస్తున్నారు.


