వైభవంగా శివపార్వతులకు అభిషేకం
కొరుక్కుపేట: కార్తీకమాసం సందర్భంగా పుళల్ కవంగారైలో వెలసి ఉన్న పురాతన శివాలయంలో శివపార్వతుల ఉత్సవ మూర్తులకు అభిషేక పుజలు వైభవంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. పుళల్ హ్యూమనిటీ లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ , సమాజ సేవకులు జి. మురళి, మీనా దంపతులు గత 8 ఏళ్లుగా లోక క్షేమాన్ని కాంక్షిస్తూ కార్తీకమాసంలో శివపార్వతులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి
అన్నానగర్: ఈరోడ్ జిల్లాలోని అందియూర్ సమీపంలోని పర్కూర్ తూర్పు కొండలలోని ఇరెట్టి అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు సహా అడవి జంతువులు తరచూ బయటకు వెళ్తున్నాయి. ఇందులో, ఒక మగ అడవి ఏనుగు ఇరెట్టి నివాస ప్రాంతంలో మొక్కజొన్న, కొబ్బరి చెట్లు సహా పంటలను దెబ్బతీసి, ప్రజలను, రైతులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఈక్రమంలో గురువారం అదే ప్రాంతంలోని అడవిలో విద్యుత్ కంచెలో చిక్కుకుని ఓ మగ అడవి ఏనుగు చనిపోయి కనిపించింది. పర్కూర్ అటవీ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.


