సారా
సాక్షీఅగర్వాల్ నాయకిగా
తమిళసినిమా: ప్రేమ, స్నేహం, అనుబంధాల ఇతివృత్తంగా తెరకెక్కిన చిత్రం సారా. గ్లామర్ పాత్రలకు మారు పేరుగా మారిన సాక్షి అగర్వాల్ వైవిధ్యమైన పాత్రలో నటించిన చిత్రం ఇది. ప్రముఖ ఇంజినీర్‌గా పేరు తెచ్చుకున్న ఈమెకు విజయ్ విశ్వతో పెళ్లి నిశ్చయం అవుతుంది. మరో రెండు నెలల్లో పెళ్లి అనగా ఆఫీస్‌లో ముఖ్య పని పడడంతో దాన్ని పూర్తిచేసుకుని వెళ్లడానికి సిద్ధం అవుతారు సాక్షీఅగర్వాల్. ఆమెతో కాబోయే భర్త కూడా ఉంటారు. అయితే సౌందర్యరాశి అయిన సాక్షీ అగర్వాల్‌పై ఒక రౌడీ కన్ను పడుతుంది. అతను ఆమెను పొందడానికి ప్రయత్నిస్తాడు. అందుకు సాక్షి అగర్వాల్ కార్యాలయంలో పనిచేసే వాచ్‌మన్, మరో ఇద్దరు వ్యక్తులకు డబ్బు ఆశ చూపుతాడు. వారు ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. వారి ప్రయత్నం ఫలించిందా, అందులో ఒక వ్యక్తి సాక్షీ అగర్వాల్, ఆమె కాబోయే భర్తను కొట్టి బందిస్తాడు. ఆ వ్యక్తి ఆమె చిన్ననాటి స్నేహితుడు అని తెలుస్తుంది. దీంతో అతను సాక్షీ అగర్వాల్‌ను ఎందుకు బంధిస్తాడు? ఆతను సాక్షీఅగర్వాల్‌ను రక్షిస్తాడా? అతని కథ ఏమిటి? సాక్షీఅగర్వాల్ పెళ్లి జరుగుతుందా? ఆమె ప్రాణాపాయంలో ఉన్న తన చిన్ననాటిస్నేహితుడి తల్లిని ఎలా కాపాడగలిగారు? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో సాగే సప్పెన్స్, థ్రిల్లర్ కథా చిత్రం సారా. చెల్లకుట్టి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని విశ్వ డ్రామ్ వరల్డ్ పతాకంపై శ్రీ పట్టవన్ నిర్మించారు. కార్తీక్ రాజా సంగీతాన్ని, జే.లక్ష్మణ్‌కుమార్, ఎంఎఫ్‌ఐ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది.


