శంకర్ దర్శకత్వంలో సూర్య?
తమిళసినిమా: ఏరంగంలోనైనా జయాపజయాలు సహజం. అయితే ఒకటి రెండు చిత్రాల అపజయంతో సినీ ప్రముఖుల పేరు తగ్గదు. అలా దర్శకుడు శంకర్ తొలి చిత్రం జెంటిల్‌మెన్‌తోనే ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ముదల్వన్, బాయ్స్, ఇండియన్, రోబో, నన్భన్, అన్నియన్, శివాజీ ఇలా వరుసగా బ్రహ్మాండ చిత్రాలతో తమిళ సినిమాను భారతీయ చిత్రాల స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు శంకర్. కాగా సమీపకాలంలో ఈయన దర్శకత్వం వహించిన ఇండియన్– 2, తెలుగులో చేసిన గేమ్‌ఛేంజర్ చిత్రాలు నిరాశపరిచాయి. కాగా తదుపరి ఇండియన్ –3 చిత్రం చేస్తారనే ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో శంకర్ తన తాజా చిత్రానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. ఈయన ఈ సారి చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. వేల్పారి అనే నవల ఆధారంగా శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు, అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిసింది. కాగా ఇందులో హీరో ఎవరన్న ఆసక్తి సర్వత్రా నెల కొంది. కాగా ఈ చారిత్రక కథా చిత్రంలో ప్రముఖ నటుడు సూర్య నటించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. కాగా నటుడు సూర్య ఇంత వరకూ శంకర్ దర్శకత్వంలో నటించలేదు. దీంతో వేల్పారి చిత్రంలో సూర్య నటిస్తే కచ్చితంగా ఈ చిత్రానికి వచ్చే క్రేజ్ అంతా ఇంతా కాదు. చూద్దాం ఈ ప్రచారంలో నిజమెంతో.. కాగా ప్రస్తుతం సూర్య కథానాయకుడిగా చాలా బిజీగా ఉన్నారు. ఆయన నటించిన కరుప్పు చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ప్రస్తుతం తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నారు. దీని తరువాత మలయాళ దర్శకుడి దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
శంకర్ దర్శకత్వంలో సూర్య?


