ఆదిపురీశ్వరర్ విశ్వరూప దర్శనం
త్యాగరాజస్వామి ఆలయంలో..
తిరువొత్తియూరు: చైన్నె, తిరువొత్తియూరు తొండై మండలంలో ప్రసిద్ధి చెందిన శివ క్షేత్రాలలో ఒకటైన తిరువొత్తియూరు త్యాగరాజ స్వామి ఆలయంలో మూలవిరాట్‌గా ఆది పురీశ్వరర్‌గా కొలువై ఉన్నారు. స్వయంభువుగా వెలసినట్లు భావించే ఈ ఆదిపురీశ్వరర్ శివలింగంపై సంవత్సరం పొడవునా వెండి కవచంతో మూసి ఉంచిన స్థితిలోనే భక్తులు దర్శనం చేసుకుంటారు. కానీ ఏడాదిలో కార్తీక మాసం పౌర్ణమిని రోజున మూసి ఉంచిన వెండి కవచం తెరిచి వుంచి 3 రోజులకు మాత్రమే భక్తులకు దర్శనం భాగ్యం కల్పిస్తారు. ఇదేవిధంగా ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని గురువారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7 గంటలలోపు ఆదిపురీశ్వరర్ కవచం తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే వెండి కవచం శుక్ర, శనివారం ప్రజల దర్శనానికి అనుమతించి శనివారం రాత్రి 8 గంటలకు జరిగే అర్ధజామ పూజ తర్వాత తిరిగి మూసివేస్తారు. ఈ 3 రోజులు ఆదిపురీశ్వరర్‌కు పునుగు సాంబ్రాణి తైల అభిషేకం, మహాఅభిషేకం చేస్తారు. గురువారం రాత్రి త్యాగరాజస్వామి మాడవీధిలో ఉత్సవం జరుగుతుంది. ఆదిపురీశ్వరర్ కవచం తెరచే కార్యక్రమం తిరువొత్తియూరు త్యాగరాజా ఆలయం లో జరిగే అతి ముఖ్యమైన తిరునాళ్లలో ఒకటి. ఈ కార్యక్రమంలో పూజ చేసిన పునుగు సాంబ్రాణి తైలం ప్రసిద్ధి చెందింది. కనుక ఈ తైలం ఉన్న చిన్న డబ్బాను రూ.20లకు ఆలయ నిర్వాహకాలు విక్రయిస్తున్నారు.


