డేనియల్ బాలాజీ అలా కనిపించారు
బీపీ 180 చిత్రంలో నటుడు డేనియల్ బాలాజీ
తమిళసినిమా: దివంగత నటుడు డేనియల్ బాలాజీ గురించి ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో తెలియని వారు ఉండరని చెప్పవచ్చు. తమిళం, తెలుగు తదితరులు దక్షిణాది భాషల్లో పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషించి విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్నారు. దైవభక్తుడు, అవివాహితుడు అయిన డేనియల్ బాలాజీ ఈ మధ్యనే కన్నుమూశారు. కాగా ఈయన ప్రధాన పాత్రను పోషించిన చివరి చిత్రం బీపీ 180. రేడియంట్ ఇంటర్నేషనల్ ఫిలింస్, అతుల్ ఇండియా మూవీస్ సంస్థల అధినేతలు ప్రతీక్ డి.చాట్బార్, అతుల్ ఎం.బోసమియా కలిసి నిర్మించిన చిత్రం ద్వారా జేపీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈయన దర్శకుడు మిష్కిన్ శిష్యుడు కావడం గమనార్హం. కాగా నటి తాన్యా రవిచంద్రన్, డేనియల్ బాలాజీ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో దర్శకుడు కె.భాగ్యరాజ్ అరుళ్ దాస్, తమిళ్,నయన సాయి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రామలింగం ఛాయాగ్రహణం, జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు జేపీ మాట్లాడుతూ సినీపరిశ్రమలో తన 19 ఏళ్ల శ్రమ ఈ చిత్రం అన్నారు. మూస కథా చిత్రాలు చేయడం తనకు ఇష్టం ఉండదన్నారు. అలా ఒక కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కించిన చిత్రం బీపీ 180 అని చెప్పారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర కోసం చాలా మందిని సంప్రదించారని, ఎవ్వరూ సెట్ కాని పరిస్థితుల్లో నటుడు డేనియల్ బాలాజీ చేతితో కత్తి పట్టుకుని తన కలలో కనిపించారన్నారు. ఆయన నటిస్తారో లేదో అన్న సందేహంతో ఫోన్ చేసి మాట్లాడానని, కథ వినగానే ఇందులోని ఆర్నాల్డ్ పాత్రను తాను చేస్తున్నానని చెప్పారన్నారు. రాజకీయ నాయకులను, అధికారులను వణికించే రౌడీ పాత్రలో ఆయన జీవించారన్నారు. పొలిటికల్, క్రైమ్ డ్రామాగా రూపొందిన ఇందులో నటి తాన్యా రవిచంద్రన్ ధైర్యవంతురాలైన వైద్యురాలిగా నటించారు.
డేనియల్ బాలాజీ అలా కనిపించారు


