అంజాన్ రీ రిలీజ్
తమిళసినిమా: ఇటీవల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోందనే చెప్పవచ్చు. గతంలో కమల హాసన్ కథానాయకుడిగా నటించిన నాయకన్, విజయ్, సూర్య కలిసి నటించిన ఫ్రెండ్స్ వంటి చిత్రాలు రీ రిలీజ్ అయ్యాయి. తాజాగా అంజాన్ చిత్రం శుక్రవారం రీ రిలీజ్ కానుంది. నటుడు సూర్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రాన్ని లింగుస్వామి దర్శకత్వంలో తిరుపతి బ్రదర్స్ సంస్థ నిర్మించింది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, సంతోష్ శివన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రంలో నటుడు విద్యుత్ జమ్వాల్ , సూరి, మనోజ్, మురళి శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్ కథా చిత్రంగా రూపొందిన అంజాన్ 2014లో విడుదల అయ్యింది. అయితే చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అలాంటి చిత్రాన్ని కథలో ఆర్డర్ మార్చి, పలు కట్స్ తో డిజిటల్ ఫార్మేట్ కు మార్చి రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ అంజాన్ మొదటి రిలీజ్ సమయంలో హైటెక్స్ పెక్టేషన్ ను క్రియేట్ చేశారన్నారు. అదే సమయంలో తిరుపతి బ్రదర్స్ సంస్థ నిర్మించిన పయ్యా ,వేట్టై, వళక్కు ఎన్ 18/9, కుండీ వంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇవి కూడా అంజాన్ చిత్రం విజయంపై ప్రభావం చూపిందన్నారు. అదే విధంగా ఆ సమయంలో తాను బిజీగా ఉండటంతో అంజాన్ చిత్రం తొలి భాగాన్ని, రెండవ భాగాన్ని కలిపి చూడలేదన్నారు వీటితో పాటు తనపై అధికంగా ట్రోలింగ్ జరిగిందని చెప్పారు. ఇప్పుడు చిత్రాన్ని సరికొత్త ఆర్డర్ తో అనవసర సన్నివేశాలను తొలగించి డిజిటల్ ఫార్మేట్లో విడుదల చేస్తున్నట్లు లింగుస్వామి పేర్కొన్నారు.


