నాగ వాహనంలో.. చంద్రశేఖరుడి చిద్విలాసం
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన గురువారం ఉదయం వినాయకుడు, చంద్రశేఖరుడు సింహ, బంగారు నాగ వాహనంలో మాడ వీధుల్లో ఊరేగారు. అంతకుముందు ఆలయంలోని అన్నామలైయార్ సమేద ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పంచమూర్తులకు ప్రత్యేక పుష్పలంకరణ చేసి మాడ వీధుల్లో ఊరేగించారు. అదేవిధంగా బుధవారం రాత్రి పంచ మూర్తులకు ప్రత్యేక పుష్పాలంకరణలు చేసి మూసిక వాహనం, హంస వాహనాలకు ప్రత్యేక పూజలు చేసి వివిధ వాహణాల్లో ఆశీనులు చేయడంతో పాటూ వాటికి ప్రత్యేక విద్యుత్ దీపాలను అలంకరించి అరుణాచలేశ్వరునికి హరోం హరా... అంటూ భక్తులు నామస్మరణాలు చేసుకొని మాడ వీధుల్లో ఊరేగించారు.
ప్రత్యేక రైలు, బస్సుల ఏర్పాటు
కార్తీక బ్రహ్మోత్సవాలను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో డిసెంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈ రైలు, బస్సులను వేలూరు, చైన్నె, పుదుచ్చేరి వంటి ప్రాంతాల నుంచి ప్రత్యేక రైలు నడపనున్నారు. అదేవిధంగా ఇప్పటికే 25 చోట్ల తాత్కాలిక బస్టాండ్‌లు ఏర్పాటు చేసి బస్సులను బస్టాండ్‌లోనికి రాకుండా తాత్కాలిక బస్టాండ్‌లకే పరిమితం చేయనున్నారు. ఆలయం వద్దకు ఆటోలు, వాహనాలు రాకుండా కట్టుదిట్టం చేశారు.
ఆక్రమణల తొలగింపు
రథోత్సవంతో పాటూ దీపోత్సవాన్ని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తిరువణ్ణామలై రానున్న నేపథ్యంలో తిరువణ్ణామలైలోని మాడ వీధులు, సన్నిధి వీది, ఆలయానికి వచ్చే ప్రధాన వీధుల్లో ఆక్రమణలు తొలగిస్తున్నారు. ఈ పనులను కలెక్టర్ తర్పగరాజ్ పర్యవేక్షిస్తున్నారు.
నాగ వాహనంలో.. చంద్రశేఖరుడి చిద్విలాసం


