సీఎం అభ్యర్థిగా.. విజయ్!
టీవీకే నేతృత్వంలోనే కూటమి ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో తీర్మానం సర్వాధికారాలు అధ్యక్షుడికే సీఎం స్టాలిన్‌ను టార్గెట్ చేసి వ్యాఖ్యల తూటాలు కరూర్ మృతులకు నివాళి
తమిళగ వెట్రికళగం(టీవీకే) నాయకత్వంలోనే కూటమి, కూటమి సీఎం అభ్యర్థి విజయ్ అని ఆ పార్టీ ప్రత్యేక సర్వ సభ్య సమావేశంలో తీర్మానించారు. కూటమి గురించి నిర్ణయాలు తీసుకునే సర్వాధికారాలను పార్టీ అధ్యక్షుడు విజయ్‌కు అప్పగించారు. ఇక ఈ సమావేశంలో సీఎం స్టాలిన్‌ను విజయ్ టార్గెట్ చేస్తూ వ్యాఖ్యల తూటాలను పేల్చారు.
సాక్షి, చైన్నె: కరూర్‌లో విజయ్ ప్రచారం సందర్భంగా సెప్టెంబర్ 27న జరిగిన పెను విషాద ఘటనతో రాజకీయ ప్రయాణానికి కాస్త విరామాన్ని ఇచ్చుకోవాల్సిన పరిస్థితి టీవీకే వర్గాలకు ఏర్పడింది. నెల రోజుల తదుపరి బాధితులకు విజయ్ పరామర్శల ప్రక్రియ ముగింపుతో రాజకీయ కార్యక్రమాల విస్తృతానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రత్యేక సర్వ సభ్య సమావేశానికి చర్యలు తీసుకున్నారు. కరూర్ ఘటన సందర్భంగా అన్నాడీఎంకే, బీజేపీ తదితర ప్రతి పక్షాలు విజయ్‌కు మద్దతుగా నిలవడంతో కూటమి విషయంగా ఈ సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు అనే చర్చ ఊపందుకుంది. అదే సమయంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ప్రచారంలో టీవీకే జెండాలు ప్రత్యక్షం కావడంతో ఆ కూటమిలోకి విజయ్ వెళ్తారన్న చర్చ మరింత జోరందుకుంది. అయితే, వీటిన్నింటికీ చెక్‌పెడుతూ విజయ్ నేతృత్వంలోనే కూటమి, సీఎం అభ్యర్థి విజయ్ అని స్పష్టం చేస్తూ ప్రత్యేక సర్వ సభ్య సమావేశంలో తీర్మానం చేయడం విశేషం.
మహాబలిపురం వేదికగా..
విజయ్ ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా మహాబలిపురానికి వేదికగా ఎంపిక చేస్తూ వస్తున్నారు. ఆ దిశగా పార్టీ ప్రత్యేక సర్వ సభ్య సమావేశానికి మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌ను వేదికగా ఎంపిక చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు విజయ్, ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, ప్రచార డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున, సంయుక్త కార్యదర్శి నిర్మల్‌కుమార్‌తో పాటూ పార్టీ కోర్ కమిటీ, రాష్ట్ర కమిటీ, సర్వ సభ్య సమావేశం సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తొలుత కరూర్‌లో మరణించిన వారికి నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. అనంతరం జిల్లాల వారీగా నేతలుప్రసంగించారు. తదుపరి రాష్ట్ర స్థాయి నేతల ప్రసంగాలతో 12 తీర్మానాలను ప్రవేశ పెట్టారు. భుస్సీ ఆనంద్ తన ప్రసంగం ద్వారా అందరి చేత విజయ్‌ను సీఎం చేద్దాం అన్న నినాదంతో ప్రతిజ్ఞ చేయించారు.
టార్గెట్ స్టాలిన్..
చివరగా విజయ్ ప్రసంగిస్తూ సీఎం స్టాలిన్‌ను టార్గెట్ చేస్తూ తీవ్రంగా ప్రశ్నలతో విరుచుకు పడ్డారు. తన ప్రచారానికి విధించిన ఆంక్షలు, అడ్డంకులను గుర్తుచేస్తూ కరూర్ ఘటన గురించి ప్రస్తావించారు. రాజకీయంగా టీవీకేను అణగదొక్కే కుట్ర జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత నిశ్శబ్దం అన్నది నెలకొన్నప్పటికీ, ప్రజల మద్దతు, అభిమానంతో ముందడుగు వేస్తున్నామన్నారు. కరూర్ ఘటనను సీబీఐకు అప్పగించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి , అధికారులకు సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలను ప్రస్తావిస్తూ, సీఎం స్టాలిన్‌ను టార్గెట్ చేశారు. అబద్దాలను వళ్లించారని, కపట నాటకాలు ఆడారని, ఆగమేఘాలపై ఏక సభ్య కమిషన్‌ను వేశారని, అత్యవసరంగా అధికారుల ద్వారా ప్రెస్ మీట్లు పెట్టించేశారంటూ, ఇంత హడావుడి ఎందుకు..? సార్ అని సీఎంను ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడే క్రమంలో సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఈసందర్భంగా గుర్తు చేస్తూ, వాస్తవాలకు స్పష్టత ఇవ్వడం , చట్ట పరంగా చర్యలు తీసుకునేందుకు సత్యవంతుడి తరహాలో వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. 50 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న సీఎం స్టాలినన్ అబద్దాలను ఏ మేరకు వళ్లించారో అన్నది సుప్రీం కోర్టు సంధించిన ప్రశ్నలే నిదర్శనంగా వివరించారు. సుప్రీం కోర్టు ప్రభుత్వానికి వేసిన మొట్టికాయలను మరిచారా?, సిట్ ఏర్పాటు విషయంలో సుప్రీం కోర్టు వ్యక్తం చేసిన అసంతృప్తిని గుర్తుచేస్తూ అధికారం అనే మత్తులో, మానవత్వాన్ని మరిచి, రాజకీయ నాగరికతను విస్మరించి, మాటల మాయాజాలంతో రాజకీయం ఆడటం సబబేనా..? అని సీఎంను ప్రశ్నించారు.
సీఎం అభ్యర్థిగా.. విజయ్!


