పార్టీ విభాగాలపై చర్చ..
ప్రత్యేక సర్వ సభ్య సమావేశంలో బూత్ కమిటీ, యువజన విభాగం తదితర కీలక విభాగాల పనితీరు గురించి చర్చించారు. పార్టీ కార్యక్రమాలను కొత్త ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లే రీతిలో నేతల ప్రసంగాలు జరిగాయి. విజయ్ ప్రచారం మళ్లీ మొదలెట్టేందుకు సిద్ధమయ్యే విధంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. కూటమి విషయంగా సుదీర్ఘ చర్చ తదుపరి గత సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రకటనలకు కట్టుబడే విధంగా తీర్మానాలు ప్రవేశ పెట్టారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు టీవీకే నేతృత్వంలోనే ఎదుర్కోబోతున్నట్టు ప్రకటించారు. కూటమి సీఎం అభ్యర్థి విజయ్ అని స్పష్టం చేస్తూ ప్రత్యేక తీర్మానం చేశారు. ప్రజలు ఇష్ట పడే సీఎం అభ్యర్థి విజయ్ అన్న ట్యాగ్ లైన్‌తో ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టడమే కాకుండా, కూటమి విషయంగా అన్ని నిర్ణయాలు తీసుకునే సర్వాధికారాలను విజయ్‌కు అప్పగించారు. తదుపరి తమిళ జాలర్ల అరెస్టును ఖండిస్తూ, వారికి భద్రత కల్పించాలని, ఈశాన్య రుతుపవనాల నేపథ్యంలో మరింతగా ముందు జాగ్రత్తలు విస్తృతం చేయాలని, వరి కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలని, చైన్నె శివారులోని పళ్లికరణై భూములలో నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదన్న డిమాండ్లతో తీర్మానాలు ప్రవేశ పెట్టారు. చివరగా కోయంబత్తూరులో విద్యార్ధినిపై జరిగిన లైంగిక దాడి కేసును గుర్తు చేస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.


