ఇండియా గేమింగ్ విజన్– 2035 ఆవిష్కరణ
సాక్షి, చైన్నె: చైన్నెలో బుధవారం జరిగిన ఐజీడీసీ – 2025లో ఇండియా గేమింగ్ విజన్ 2035ను జీడీఏఐ ఆవిష్కరించింది. భారత దేశ వీడియో గేమ్ డెవలపర్ కమ్యూనిటీ నాయకత్వంలోని గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 17వ ఎడిషన్‌గా ఇండియా గేమ్ డెవలపర్ కాన్పరెన్స్ చైన్నె నందంబాక్కం వర్తక కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పీటీఆర్ పళణి వేల్ త్యాగరాజన్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. తమిళనాడులో ఐటీ ప్రగతి, ఏవీజీసీ – ఎక్స్ ఆర్ విధానం 2025 గురించి, జాతీయ విధాన చట్రానికి అనుగుణంగా రాష్ట్రంలో దీనిని ఎలా రూపొందిస్తున్నామో ఈసందర్భంగా తన ప్రసంగంలో మంత్రి వివరించారు. నైపుణ్య అభివృద్ధి, స్టార్టప్ ప్రమోషన్, ఐపీ సృష్టి, విద్యా ఏకీకరణ, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం, బలమైన సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను నిర్మించడం గురించి విశదీకరించారు. ఈ సదస్సు వేదికగా విజన్ 2035 నివేదికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జీడీఏఐ చైర్మన్ శ్రీధర్ ముప్పిడి, బోర్డు సభ్యుడు మనీష్ అగర్వాల్, ఐటీ కార్యదర్శి బ్రజేంద్ర నవనీత్, ఎల్కాట్ ఎండీ డాక్టర్ కేపి కార్తికేయన్ తదితరులు పాల్గొన్నారు.


