సమన్వయంతోనే విజయం
సాక్షి, చైన్నె : సమన్వయంతో ముందడుగు వేస్తే విజయం తథ్యమని పార్టీ శ్రేణులకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఉపదేశించారు.కలిసి కట్టుగా ఎన్నికల పనుల వేగాన్ని పెంచాలని ఆదేశించారు. వివరాలు.. గత వారం రోజులుగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి చైన్నె రాయపేట పార్టీ కార్యాలయంలో వివిధ విభాగాలతో సమావేశాలు నిర్వహిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం 82 మంది పార్టీ జిల్లాల కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఇందులో పళణిస్వామితో పాటుగా పార్టీ నేతలు దిండుగల్ శ్రీనివాసన్, ఎస్పీ వేలుమణి, నత్తంవిశ్వనాథన్, కేపీ మునుస్వామిలు జిల్లాల వారీగా పార్టీ కార్యక్రమాలను గురించి ఆరా తీశారు. ఆయా జిల్లాలో పార్టీ బలం, కేడర్‌తో మమేకం అయ్యే విధంగా జరుగుతున్న, చేపట్టనున్న వివిధ ఎన్నికల పనులను గురించిచర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియ జరుగుతుండటంతో దాని గురించి చర్చించారు.పార్టీ వర్గాలు ఈ ప్రక్రియపై అప్రమత్తంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని పళణి స్వామి ఆదేశించారు. అధికార పక్షం ఏదేని వ్యూహాలు, కుట్రలకు పదును పెట్టే పనిలో ఉంటే,తిప్పి కొట్టే విధంగా ముందుకెళ్దామని సూచించారు. ఎన్నికల పనులు వేగవంతం చేయాలని, అందరూ సమన్వయంతో ముందుకెళ్లడం ద్వారా విజయం తథ్యమన్న భరోసాను నేతలకు పళణి స్వామి ఇవ్వడం గమనార్హం. అదే సమయంలో ఇటీవల పార్టీ నుంచి తొలగించబడ్డ ఎమ్మెల్యే సెంగొట్టయన్ వ్యవహారం గురించి సైతం ఈ సమావేశంలో చర్చ వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. పార్టీలో ఎవరైనా అసంతృప్తి వాదులు ఉన్నారా..? , పార్టీకి వ్యతిరేకంగా చాప కింద నీరులా ఏదేని కుట్రలు చేస్తున్నారా..? అన్న దిశగా సమాచారాలు రాబట్టే ప్రయత్నాలు జరిగినట్టు సమాచారం. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించబోమన్న హెచ్చరికలు సైతం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి.
సమన్వయంతోనే విజయం


