పరందూరులో 1000 ఎకరాలు రెడీ
– రూ. 400 కోట్ల పరిహారం
సాక్షి, చైన్నె : చైన్నెలో మరో విమానాశ్రయం పనుల కోసం పరందూరులో 1000 ఎకరాల స్థలాన్ని సేకరించారు. ఇందుకోసం రూ. 400 కోట్లు పరిహారం అందజేశారు. వివరాలు.. చైన్నె మీనంబాక్కం విమానాశ్రయంలో పెరిగిన రద్దీతో మరో విమానాశ్రయం నిర్మాణంపై కేంద్రం దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇందు కోసం కాంచీపురం జిల్లా పరిధిలోని పరందూరును ఎంపిక చేశారు. చైన్నె నుంచి 60 కి.మీ దూరంలో ఈ పరందూరు ఉండటం, ఇక్కడ 4,798 ఎకరాల స్థలం ఉండటం విమానాశ్రయానికి అనుకూలంగా మారింది. ఈ పనులను రూ. 40 వేల కోట్లతో చేపట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. స్థల సేకరణకు తగ్గ కసరత్తులపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టారు. అయితే తమ పంట పొలాలను విమానాశ్రయం కోసం స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను పరందూరుతో పాటుగా ఆ పరిసరాలలోని 13 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నేటికి పోరాటం చేస్తున్నారు. ఈ నిరసనలో పని లేదన్నట్టుగా అధికారులు తమ పనులను వేగవంతం చేశారు. పలు మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, సివిల్ ఏవియేషన్ ప్రతినిధులతో కూడిన మార్గదర్శక కమిటీ భద్రతా అంశాలను పరందూరులో క్షుణ్ణంగా పరిశీలించి, విమానాశ్రయంకు ఇదే సరైన స్థలంగా ప్రకటించింది. ఈ పరిస్థితులలో ఇక్కడ 1000 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం సేకరించింది. ఇందు కోసం రూ. 400 కోట్లు పరిహారం బాధితులకు అందజేశారు.


