వేలూరులో మినీటైడల్ పార్కు
వేలూరులో టైడల్ పార్కును ప్రారంభిస్తున్న సీఎం స్టాలిన్
విద్యార్థులకు ప్రోత్సాహకంగా చెక్కు అందజేస్తూ..
సాక్షి, చైన్నె: వేలూరులో రూ. 32 కోట్లతో నిర్మించిన మినీ టైడల్ పార్కును సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇక్కడ 600 మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే నామక్కల్ జిల్లా రాశి పురంలో మినీ టైడల్ పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. వేలూరులో తమ సేవలకు శ్రీకారం చుట్టే విధంగా పలు సంస్థలు ముందుకు రాగా సీఎం స్టాలిన్ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. ఈకార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి, మంత్రులు దురై మురుగన్, టి.ఆర్.పి. రాజా తదితరులు పాల్గొన్నారు. అనంతరం హిందూ ధర్మాదాయ శాఖ నేతృత్వంలని 18 పాఠశాలలలో శిక్షణలో ఉన్న విద్యార్థులకు ప్రోత్సహకాన్ని అందించేందుకు చర్యలు తీసుకున్నారు. 297 మంది విద్యార్థులకు రూ. 10 వేలు, 66 మంది పార్ట్ టైమ్ శిక్షణ విద్యార్థులకు రూ. 5 వేలు ప్రోత్సహకం అందించే విధంగా పది మంది విద్యార్థులకు సీఎం స్టాలిన్ సచివాలయంలో చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మంత్రి శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే, రూ. 23 కోట్ల వ్యయంతో నామక్కల్ జిల్లా తిరుచంగోడులో నాలుగు అంతస్తుల భవనంగా 225 పడకలతో నిర్మించిన కొత్త వైద్యభవనాన్ని సీఎం స్టాలిన్ వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం ప్రజా , పునరావాసం, పర్యావరణం, వాతావరణ మార్పు , అటవీ శాఖలకు సంబంధించిన వివిధ అంశాల గురించి అధికారులతో సీఎం స్టాలిన్ సమీక్షించారు. గ్రీన్‌ఇన్నోవేషన్ , గ్రీన్ తమిళనాడు ఉద్యమంతోపాటుగా అటవీ జంతువుల అత్యవసర సంరక్షణ –వన్యప్రాణుల చికిత్స కోసం కోయంబత్తూరు, తిరునల్వేలి, తిరుచ్చిలలో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. అలాగే,ప్రభుత్వం ఇది వరకు ఇచ్చిన ఉత్తర్వులు, నిర్మాణంలో ఉన్న పనులను గురించి సీఎం ఆరా తీశారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి, మంత్రులు తంగం తెన్నరసు, రాజకన్నప్పన్ పాల్గొన్నారు.
వేలూరులో మినీటైడల్ పార్కు


