క్లుప్తంగా
సర్దార్ వల్లభాయ్‌పటేల్
శతజయంతి ఉత్సవాలు
–తిరువళ్లూరులో ర్యాలీని
ప్రారంభించిన కలెక్టర్
తిరువళ్లూరు: సర్దార్ వల్లబాయ్ పటేల్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శాంతి ర్యాలీ పాదయాత్రను కలెక్టర్ ప్రతాప్, యువ కేంద్రం జిల్లా అధికారి నమ్మాలకృష్ణ ప్రారంబించారు. స్ధర్ వల్లబాయ్ పటేల్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రాల్లో యువకేంద్రం ఆధ్వర్యంలో పాదయాత్ర, ర్యాలీలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే శాంతి ర్యాలీ కలెక్టరేట్ నుంచి కామరాజర్ విగ్రహం వరకు సాగింది. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, యువత జాతీయ జెండాను చేతపట్టి పాల్గొన్నారు. అధికారులు, యువత పెద్దఎత్తున పాల్గొన్నారు.
వేర్వేరు కేసుల్లో
నిందితుడి హత్య
తిరువళ్లూరు: పలు కేసుల్లో ప్రధాన నిందితుడిగా వున్న యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్ ప్రాంతంలో కలకలం సృష్టించింది. మనవాలనగర్ ప్రాంతానికి చెందిన నవీన్ (24). ఇతడిపై గంజాయి విక్రయం, హత్య, స్నాచింగ్‌తోపాటు వేర్వేరు కేసులు పెండింగ్‌లో వున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఎంజీఆర్ నగర్‌లోని చెరువు కరకట్ట వద్ద యువకుడు ఒకరు హత్యకు గురైనట్టు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో హత్యకు గురైన వ్యక్తి మనవాలనగర్ ప్రాంతానికి చెందిన కుళ్లశీనుగా గుర్తించారు. ఇతడిపై వేర్వేరు కేసులు వున్న క్రమంలో హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
బస్సు బోల్తా పడి
యువకుడి మృతి
తిరువొత్తియూరు: ఆమ్ని బస్సు బోల్తా పడి యువకుడు మృతిచెందాడు. బెంగళూరు నుంచి 15 మంది ప్రయాణికులతో ఒక ఆమ్నీ బస్సు మంగళవారం రాత్రి కొడైకెనాల్ వైపు వెళుతోంది. ప్రస్తుతం కీరంపూర్ ప్రాంతంలో ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు వేసి అన్ని వాహనాలు ఆ మార్గంలో వెళ్తున్నాయి. ఈక్రమంలో తెల్లవారుజామున 3.30 గంటలకు ఆమ్ని బస్సు డ్రైవర్ దీనిని గమనించకుండా వేగంగా నడపడంతో అకస్మాత్తుగా బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దిండిగల్ జిల్లా వక్కంపట్టి ప్రాంతానికి చెందిన వినోద్‌కన్నన్ (38) మృతిచెందాడు. మరో 14 మంది గాయపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అదనపు భవనానికి భూమి పూజ
పళ్లిపట్టు: పళ్లిపట్టు సమీపం పొదటూరుపేట ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో వెయ్యికి పైగా బాలికలు చదువుకుంటున్నారు. బాలికలకు చాలీచాలని తరగతి గదులతో ఇబ్బందులు చెందుతున్నారు. ఈక్రమంలో పాఠశాల విద్యార్థినుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కోర్కె మేరకు నాబార్డు నిధుల నుంచి రూ. 2.43 కోట్ల నిధులు కేటాయించారు. దీంతో పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ బుధవారం నిర్వహించారు. ఇందులో తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని ఆరు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్, రెండు మరుగుదొడ్లు నిర్మాణానికి సంబంధించి భూమిపూజతో కట్టడ నిర్మాణ పనులను ఎమ్మెల్యే చంద్రన్ ప్రారంభించారు. ఇందులో ప్రజాపనుల శాఖ ఎస్‌డీఓ మురళి, పాఠశాల హెచ్‌ఎం పద్మప్రియ, ఏహెచ్‌ఎం శశికుమర్, డీఎంకే పట్టణ కార్యదర్శి బాబు, పీటీఏ అధ్యక్షుడు నాగలింగం పాల్గొన్నారు.
దొంగ అరెస్టు
శ్రీరంగరాజపురం : మండలంలో ఇటీవల ఓ ఇంటిలో చోరీకి పాల్పడిన ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ సుమన్ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని వీవీ పురం పంచాయతీ గంగమ్మగుడి గ్రామానికి చెందిన కె.చిట్టిబాబునాయుడు ఇంటిలో ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా ఈవీఆర్ మనాలి గ్రామానికి చెందిన జి.గోపాలకృష్ణ కుమారుడు జి.సుందర్రాజు (24) తలుపులు పగలగొట్టి బంగారం, నగదు దొంగలించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చైన్నె నగరంలోని శ్రీనివాస్ స్ట్రీట్‌లో నిందితుడు సుందర్రాజును అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ.5 వేలు నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.
క్లుప్తంగా


