భక్తులతో గిరివలయం కిటకిట
వేలూరు: తమిళ ఐపసి మాస పౌర్ణమిని పురష్కరించుకొని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ గిరివలయం రోడ్డులో భక్తులతో కిటకిటలాడింది. పంచ భూత స్థలమైన అరుణాచలేశ్వరాలయంలో ప్రతినెలా పౌర్ణమి రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గిరివలయం రోడ్డులోని 14 కిలోమీటరు దూరం నడిచి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఐపసి మాసపౌర్ణమి మంగళవారం రాత్రి 9.45 గంటలకు ప్రారంభమై బుధవారం సాయంత్రం 7.29 గంటలకు ముగియడంతో కార్తీక దీపం తరహాలోనే భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆలయ అధికారులు ఆలయంలో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. అదేవిధంగా ఆలయంలోని అన్నామలైయార్ సమేత ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణలు చేశారు. ఇదిలాఉండగా పౌర్ణమి సమయంలో 14 కిలోమీటరుర్ల దూరంలో ఉన్న గిరివలయం రోడ్డులో కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకుంటే చేసిన పాపాలుపోయి పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. అందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో మంగళవారం సాయంత్రం తిరువణ్ణామలై చేరుకొని క్యూలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో తిరువణ్ణామలైలో మంగళవారం రాత్రి గిరివలయం రోడ్డుతోపాటు ఆలయ మాడ వీధుల్లోనూ చూసినా భక్తులతో కిటకిటలాడింది. అదేవిధంగా భక్తులు ఆలయంలోను బారులు తీరి ఆరు గంటల పాటు క్యూలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని మాడ వీధుల్లో ఊరేగించడంతో భక్తులు అధికసంఖ్యలో కర్పూరహారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా చిత్తూరు, తిరుపతి, తిరుమల నుంచే కాకుండా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను తిరువణ్ణామలైకి నడపడంతో ఆంధ్ర రాష్ట్ర భక్తులు అఽధిక సంఖ్యలో చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు.


