వైభవంగా రుద్రపాదాల ముక్కోటి
చంద్రగిరి: శంకరా అని పిలిస్తే, కోరిన కోర్కెలు తీర్చే బోళాశంకరుడికి బుధవారం విశేష పూజలు జరిగాయి. తొండవాడలోని స్వర్ణముఖీ నది ఒడ్డున వెలసిన శ్రీఅగస్త్యేశ్వరస్వామి(ముక్కోటి) ఆలయంలో రుద్రపాదాల ముక్కోటి, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయం శివనామస్మరణలతో మార్మోగింది. ఉదయం అగస్త్యమహామునికి అభిషేకం నిర్వహించారు. తదుపరి స్వామి, అమ్మవార్లకు అభిషేక సేవను నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరిగి రాత్రి స్వామి, అమ్మవార్లు నంది వాహనంపై ఆశీనులై ఊరేగారు. పౌర్ణమి, రుద్రపాదాల ముక్కోటి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని, ఆలయంలో నేతి దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలను చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టుకు చెందిన గాయకుల భక్తి గేయాలు అలరించాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీఐ సురేష్ కుమార్ నేతృత్వంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
నేటి కార్యక్రమాలు
రుద్రపాదాల ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామి వారికి అభిషేకం, సాయంత్రం దీపారాధన. స్వామి, అమ్మవార్ల కల్యాణం, ఊంజల్ సేవ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
పుట్టాలమ్మ ఆలయంలో...
చంద్రగిరిలో కొత్తపేటలోని శ్రీశ్యామలాంబ సమేత మల్లేశ్వరాలయం(పుట్టాలమ్మ)లో కార్తీక పౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి, ముత్యాల అలంకరణను చేపట్టి, భక్తులకు దర్శనం కల్పించారు. స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు శివకుమార్ శర్మ,ఽ దర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
విశేష అలంకరణలో స్వామి, అమ్మవార్లు, ముక్కోటిలో నేతిదీపాలను వెలిగిస్తున్న మహిళలు
వైభవంగా రుద్రపాదాల ముక్కోటి
వైభవంగా రుద్రపాదాల ముక్కోటి


