ముంపు ప్రాంతవాసులకు సహాయకాల పంపిణీ
తిరువళ్లూరు: జిల్లాలోని నత్తంబేడు, తిరునిండ్రవూర్ తదితర ముంపు ప్రాంతాల వాసులకు మంత్రి నాజర్ బుధవారం ప్రభుత్వ సహాయకాలు పంపిణీ చేశారు. తిరునిండ్రవూర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతాప్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా మంత్రి నాజర్ హాజరై బియ్యం, కూరగాయలు, రొట్టెలు, దుస్తులు తదితర సామగ్రి అందజేశారు. అనంతరం మంత్రి నాజర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసినా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలను చేపట్టిందన్నారు. ముంపు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి అన్ని సదుపాయాలను అందిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణస్వామి, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్, డిప్యూటీ డైరెక్టర్ యువరాజ్, ఆర్డీఓ రవిచంద్రన్ పాల్గొన్నారు.


