ఆత్మను ప్రేమించిన యువకుడు
తమిళసినిమా: కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. అందుకోసం నూతనతరం సరి కొత్త ప్రయోగాలతో చిత్రాలను చేయడానికి ముందుకు వస్తోంది. అలా రూపొందిన తాజా చిత్రం మెసెంజర్. ప్రేమ గుడ్డిది అంటారు. అయితే అదే ప్రేమ ఆత్మలను కూడా ప్రేమించేలా చేస్తుంది అనే ఇతి వృత్తంతో తెరకెక్కిన చిత్రం మెసెంజర్. ఒక యువకుడి ప్రేమను బ్రేకప్ చెప్పిన యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. దీంతో ఆ భగ్నప్రేమికుడు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడతాడు. సరిగ్గా అలాంటి సమయంలో అతని ఫోన్‌కు ఒక మెసేజ్ వస్తుంది. అందులో ప్లీజ్ ఆత్మహత్య చేసుకోకండని ఉంటుంది. ఆ మెసేజ్ ఎవరు పెట్టారు? అది ఎక్కడి నుంచి వచ్చింది అనే వివరాలను తెలుసుకున్న ఈ యువకుడికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అవి ఏమిటి అనే పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం మెసెంజర్. మరణించిన ఒక యువతి ఆత్మను యువకుడు ప్రేమించడంతోపాటు, కనిపించని ఆ ఆత్మనే పెళ్లి చేసుకుంటానని అతని తల్లిని ఒప్పించడం వంటి అంశాలు నమ్మశక్యం కాకపోయినా, దర్శకుడు ఫాంటసీని జోడించి ఆసక్తిగా తెరకెక్కించడం వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. శ్రీరామ్ కార్తీక్, మనీషాశ్రీ, ఫాతిమానజీమ్, హీరోహీరోయిన్లుగా నటించిన ఇందులో వైశాలి రవిచంద్రన్ ముఖ్యపాత్రలను పోషించారు. రమేశ్ ఇళనగమణి కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీవీకే.ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై పి.విజయన్ నిర్మించారు.ఈ చిత్రాన్ని తమిళనాడులో యాక్షన్ రియాక్షన్ సంస్థ అధినేత జెనీశ్ విడుదల చేస్తున్నారు.


