5 లేదా 10 శాతం నిర్మాతలకు ఇవ్వాలి
వళ్లువన్ చిత్ర ఆడియోను ఆవిష్కరించిన ఆర్‌కే.సెల్వమణి, ఆర్వీ.ఉదయకుమార్,
పేరరసు, సినీ ప్రముఖులతో యూనిట్ సభ్యులు
తమిళసినిమా: ఆరుపడై ప్రొడక్షన్స్ పతాకంపై శైల్‌కుమార్ నిర్మించిన చిత్రం వళ్లువన్. శంకర్ సాఽరథి దర్శకత్వం వహించిన ఇందులో సేతన్ శీను, నటి ఆస్నా జవేరి జంటగా నటించారు. మనోబాలా, సాయిదీనా, దీప, రామచంద్రన్, మీసై రాజేంద్రన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అశ్వత్ సంగీతం, సురేశ్‌బాల చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు, ఫెప్సీ అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి, ఆర్వీ ఉదయకుమార్, పేరరసు, కే.రాజన్ తదితర సినీ ప్రముఖలు పాల్గొని, ఆడియోను ఆవిష్కరించారు. చిత్ర దర్శకుడు శంకర్ సారథి మాట్లాడుతూ అమాయక ప్రజలు శిక్షించబడరాదని డా.అంబేడ్కర్ చట్టాలను తీసుకొచ్చారన్నారు. అయితే చట్టాల్లోని మంచి విషయాలను మరచి, అందులోని లొసుగులను అడ్డం పెట్టుకుని తప్పించుకుని తిరిగే పరిస్థితి నెలకొందన్నారు. అలా చట్టాన్ని చేతిలోకి తీసుకుని తప్పులు చేసే వారిని ఎవరు శిక్షిస్తారు? అన్న ఇతి వృత్తంతో రూపొందించిన చిత్రం వళ్లువన్ అని చెప్పారు. ఫెప్సీ అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి మాట్లాడుతూ చిత్రం ట్రైలన్‌ను చూస్తే కమర్శియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అనిపించిందన్నారు. గత 10 ఏళ్లలో సుమారు 2500 చిత్రాలు విడుదలయ్యాయని, వాటిలో 2వేల చిత్రాలను నిర్మిచింది చిన్న నిర్మాతలేనని పేర్కొన్నారు. అలా వాళ్లే తమకు అన్నం పెడుతున్నారన్నారు. అయితే ఇన్నేళ్లుగా మొదటి చిత్రాన్ని తీసిన 2 వేల మంది నిర్మాతలు కనిపించకుండాపోయారన్నారు. ఒక్క సంగీత దర్శకుడు కన్నుమూస్తే ఆయనకు కుటుంబానికి రాయల్టీ వస్తుందన్నారు. కానీ నిర్మాతలకు ఎలాంటి గ్యారెంటీ లేదన్నారు. అందువల్ల తమ ఉన్నతికి కారణం అయిన నిర్మాతలకు హీరోలు తమ ఆదాయంలో 5 లేదా 10 శాతం నిర్మాతలకు చెల్లించేలా ఒక సిస్టం తీసుకు వస్తే బాగుంటుందనే అబిప్రాయాన్ని ఆర్‌కే.సెల్వమణి వ్యక్తం చేశారు.
5 లేదా 10 శాతం నిర్మాతలకు ఇవ్వాలి


