పగటి కలలు
డీఎంకే ఉన్నంత కాలం అవి నెరవేరవు
2026 తమిళనాడు రక్షణను ధ్రువీకరించే ఎన్నిక
సీఎం స్టాలిన్ వ్యాఖ్య
ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తత అవసరమని హెచ్చరిక
చైన్నెలో ‘నా పోలింగ్ బూత్‌లో విజయం’పై శిక్షణ
బీజేపీవి..
తమిళ గడ్డపై డీఎంకే ఉన్నంత కాలం
బీజేపీ కలలన్నీ.. పగటి కల్లలే అవుతాయని, వాటిలో ఏ ఒక్కటీ నెరవేర నివ్వబోమని డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. 2026 ఢిల్లీని ఢీకొట్టే
డీఎంకే ప్రభుత్వమా? బానిస పాలనా? అన్నది తేల్చే రీతిలో తమిళనాడు రక్షణను ధ్రువీకరించే ఎన్నికలు కాబోతున్నాయని
అభిప్రాయపడ్డారు.
సమావేశం వేదికపై డీఎంకే నేతలు, ప్రసంగిస్తున్న స్టాలిన్
సాక్షి, చైన్నె: చైన్నె శివారులోని మహాబలిపురంలోని ఓ రిసార్ట్ వేదికగా మంగళవారం డీఎంకే నేతృత్వంలో ‘నా పోలింగ్ బూత్ ఓ విజయవంతమైన పోలింగ్ బూత్’ నినాదంతో శిక్షణ సమావేశాన్ని నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల పనులను పోలింగ్ బూత్‌స్థాయిలో నుంచి వేగవంతం చేసే దిశగా ఈ కొత్త కార్యక్రమాన్ని డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. తమిళనాడును అన్ని విధాలుగా అణగ దొక్కే ప్రయత్నంలో మోసపూరిత వ్యూహాలకు, కుట్రలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒడిగడుతోండడాన్ని తిప్పి కొట్టే రీతిలో ఈ శిక్షణలో నేతలు వ్యాఖ్యల తూటాలను పేల్చారు. పోలింగ్ బూత్‌లలో స్థానికంగా బలం, విజయాన్ని నిర్ధారించే విధంగా, ఆయా నియోజకవర్గాలలో స్థానికంగా పోలింగ్ బూత్‌ల వారీగా బలాన్ని చాటుకునే రీతిలో జరిగిన ఈ సమావేశానికి జిల్లాల కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు, రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పరిశీలకులు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు యూనియన్, నగర, ప్రాంతీయ , పట్టణ సంఘాల కార్యదర్శులు హాజరయ్యారు. డీఎంకే ప్రదాన కార్యదర్శి దురై మురుగన్, కోశాధికారి కేఎన్‌నెహ్రూ, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కనిమొళి, కేఎన్ నెహ్రూ, తిరుచ్చి శివ, ఐ. పెరియస్వామి, యువజన ప్రధాన కార్యదర్శి ఉదయనిధి సీఎం స్టాలిన్‌తో పాటూ వేదికపై కూర్చుని పలు సూచనలు, సలహాలు తమ వ్యాఖ్యల ద్వారా తెలియజేశారు.
పొరాడుదాం..
తమిళనాడు కోసం బీజేపీతో పోరాడుతూనే ఉంటామన్నారు. ‘మనం గెలుస్తాం‘ అన్న నినాదాన్ని తమిళనాడు అంతటా ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని, దివంగత నేతలు పెరియార్, అన్నా, కరుణానిధిల బాటలో ఆత్మగౌరవం నినాదంతో ఫాసిజ బీజేపీకి వ్యతిరేకంగా నిరంతరం పోరాటం కొనసాగుతుందన్నారు. ఎన్నో పోరాటాలలతో విజయం సాధించామని, హక్కులను సాధించుకున్నామని గుర్తు చేస్తూ, పాసిస్టులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వాటిని సమర్థంగా తిప్పి కొడుదామన్నారు. డీఎంకేలోని కేడర్, నాయకుడి ముఖాలలో తాను సూర్యోదయాన్ని చూస్తున్నానని పేర్కొంటూ, ఈ శిక్షణ తదుపరి వారివారి పోలింగ్ బూత్‌లలో గెలుపును నిర్ధారించే విధంగా ముందుకు సాగాలని ఆదేశించారు. రోజూ సాయంత్రం పోలింగ్ బూత్‌లలో సమావేశాలు నిర్వహించాలని, ప్రజలతో మాట్లాడాలని, ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకుని జిల్లాల కార్యదర్శుల ద్వారా తనకు సమాచారం పంపించాలని సూచించారు. ప్రతి వారం పంపించే ఈ నివేదికను తాను స్వయంగా పరిశీలిస్తానని, తానే స్వయంగా స్థానికంగా ఉన్న వారితో మాట్లాడుతానని వివరిస్తూ, ఇందుకు సమాయత్తం అయ్యే విధంగా ప్రతి బూత్ కమిటీ సభ్యుడు ప్రతిజ్ఞతో ప్రజలలోకి దూసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో ఫీల్డ్ వర్క్ ముందంజలో ఉండాలని, ఏడోసారి అధికారం తథ్యం అన్నది నిర్ధాంచుకుందామన్నారు. తమిళనాడు ఆత్మగౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడుదామని, తమిళనాడును, జాతి శత్రువులను, తమిళ ద్రోహులను తరిమి కొడుదామని, మన భూమిని, భాషను, గౌరవాన్ని మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. డీఎంకే కూటమి అన్ని స్థానాలలో విజయ ఢంకా మోగించే విధంగా ప్రతిఒక్కరి పని తీరు ఉండాలని సూచించారు. తమిళనాడు ఇప్పుడు సామాజిక, రాజకీయ, ఆర్థికంగా దండయాత్రను ఎదుర్కొంటోందని పేర్కొంటూ, అన్ని విధాలుగా అన్యాయం తలబెట్టే ప్రయత్నాలు విస్తృతం అయ్యాయని వివరించారు. ఈ దాడిని తిప్పికొట్టే శక్తి మనకు ఉందని పేర్కొంటూ, ఈ భూమిపై డీఎంకే ఉన్నంత కాలం ఢీ కొడుతూనే ఉంటుందన్నారు. తాజాగా స్పెషల్ ఇంటెన్సివ్ ఓటరు జాబితా(ఎస్‌ఐఆర్) సవరణ పేరిట కొత్త ఎత్తుగడులు వేసి ఉన్నారని, దీనిపై అప్రమత్తత అవశ్యమని, బీహార్ పరిణామాలను గుర్తెరిగి ఓటరు జాబితా సవరణను నిశితంగా పరిశీలించాలని, ప్రజల ఓటుహక్కును పరిరక్షించాలని పిలుపునిచ్చారు. బీజీపీకి బానిసగా మారి, అమిత్ షాకు అన్నాడీఎంకేను తాకట్టు పేట్టేసిన పళణి స్వామి తాజా చర్యలు తమిళనాడు ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరని పేర్కొంటూ, తమిళనాడుకు వ్యతిరేకంగా ఆయన సాగిస్తున్న అవకాశవాదాన్ని ప్రజలలోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఏడోసారి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలని, తమిళనాడును శాశ్వతంగా పరిపాలించడానికి డీఎంకేకు మాత్రమే అర్హత ఉందని నిరూపించుకునే విధంగా శ్రమించాలని పిలుపునిచ్చారు.
పగటి కలలు నెరవేరనివ్వం..
ఈ భూమిపై డీఎంకే ఉన్నంత కాలం బీజేపీ పగటి కలలు నిజం కావు అని స్పష్టం చేస్తూ సమావేశంలో సీఎం స్టాలిన్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. 2026లో జరగబోయే ఎన్నికలు కీలక మలుపు కావాలని పేర్కొంటూ, ఇందులో డీఎంకే ప్రభుత్వమా.. లేదా ఢిల్లీకి తలవంచే బానిస ప్రభుత్వమా? అన్నది నిర్ణయించుకోవాలని ఓటర్లకు సూచించారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ లక్ష్యాలను సాధించేందుకు నిత్యం కృషి చేస్తూనే ఉండాలని సూచించారు. ఇదే అసలైన ఉద్యమం అని ఇందులో రోజూ పనిచేస్తూనే ఉండాలని, నా పోలింగ్ బూత్ ఒక విజయపు పోలింగ్ బూత్ అన్న నినాదాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపు నిచ్చారు. అందరి సమష్టి కృషితో ఆరోసారి డీఎంకే పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని, ఏడోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తంచేశారు. 2019లో సవాళ్లను అధిగమించి ప్రభుత్వాన్ని గొప్ప విజయవంతో ఏర్పాటు చేసుకున్నామని, 2026లో ద్రావిడ మోడల్ 2.ఓ అందరి కృషితో, తమిళనాడు ప్రజల మీద ఉన్న నమ్మకంతో కొనసాగుతుందని తాను స్పష్టం చేస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ద్రావిడ మోడల్ పాలనలో ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేశామని, ప్రతి ఇంట్లోకి పథకాలతో ప్రవేశించామని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం సాధించని స్థాయిలో విజయాలు సొంతం చేసుకున్నామని వివరించారు.ఈ విజయాలతోనే ధైర్యంగా ఉండగలుగుతున్నట్టుగా పేర్కొన్నారు.


