‘ఎస్‌ఐఆర్’పై కసరత్తు
సాక్షి, చైన్నె: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) కసరత్తు రాష్ట్రంలో మొదలయ్యాయి. ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ మంగళవారం సమావేశమయ్యారు. నవంబర్ 4వ తేదీ నుంచి డిసెంబరు 4వ తేదీ వరకు నెల రోజుల పాటూ ఇంటింటా పరిశీనలు, జాబితాలో సవరణలపై దృష్టి పెట్టేందుకు చర్యలు చేపట్టారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలను తమిళనాడు ఎదుర్కోబోతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో రాష్ట్రంలోని ఓటరు జాబితాను సవరించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌చర్యలు తీసుకుంది. ఈ మేరకు ప్రస్తుతం రాష్ట్రంలో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 68,467 పోలింగ్ కేంద్రాలు న్నాయి. పొరుగున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 10.21 లక్షల ఓటర్లు, 962 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలు వచ్చే ఏడాది ఎన్నికలను ఎదుర్కోనున్న నేపథ్యంలో ఇక్కడ ఓటరు జాబితా సవరణపై ఎన్నికల యంత్రాంగం దృష్టి పెట్టింది. తమిళనాడులో చేపట్టాల్సిన పనులు, ఇతరాత్రా అంశాల గురించి ఎన్నికల అధికారులతో అర్చనా పట్నాయక్ సమావేశమయ్యారు. ఇందులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎన్నికల అధికారులకు పంపించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. నవంబర్3వ తేదీలోపు అన్ని కసరత్తులు ముగించి నవంబర్ 4 నుంచి నెల రోజుల పాటూ ఇంటింటా సమగ్ర పరిశీలనకు సిద్ధమయ్యే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా పోరాటానికి డీఎంకే నేతృత్వంలోని అఖిల పక్ష సమావేశానికి నిర్ణయించారు. తమిళనాడులో ప్రజల ఓటు హక్కును కాలరాసే విధంగా కుట్ర పన్ని ఉన్రాని, దీనికి వ్యతిరేకంగా రాజకీయ పక్షాలన్నీ ఏకమై, ప్రజల మద్దతుతో పోరాటానికి నిర్ణయించారు. నవంబర్ 2వ తేదీన డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ నేతృత్వంలో ఈ సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా ఎస్‌ఐఆర్‌ను రూపంలో డీఎంకేలో గుబులు బయలుదేరిందని, వారి మోసాలు ఎక్కడ బయట పడుతాయో అన్న ఆందోళన పెరిగినట్టుందని బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆరోపించారు.


