కోవైకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
సాక్షి, చైన్నె: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మంగళవారం కోయంబత్తూరుకు వచ్చారు. ఆయనకు మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ ఇటీవల ఉ ప రాష్ట్రపతి పదవిని అధిరోహించిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించినానంతరం ఆయన ఇంత వరకు తమిళనాడుకు రాలేదు. గత నెలాఖరులోరావాల్సి ఉండగా, కరూర్ విషాద ఘటన నేపథ్యంలో వాయిదా పడింది. ఈ పరిస్థితులలో ఆయన మంగళవారం కోయంబత్తూరుకు వచ్చారు. ఉప రాష్ట్రపతిగా ప్రపథమంగా తమిళనాడుకు వచ్చిన సీపీ రాధాకృష్ణన్‌కు కోయంబత్తూరు విమానాశ్రయంలో బ్రహ్మరథం పట్టేవిధంగా ఆహ్వానం పలికారు. మంత్రులు ముత్తుస్వామి, స్వామి నాధన్‌ల నేతృత్వంలో అధికారిక ఆహ్వానం పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌తో పాటూ బీజేపీ వర్గాలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొడీస్సీయా ఆడిటోరియంలో కోయంబత్తూరులో పారిశ్రామిక వేత్తలతో జరిగిన సమావేశానికి సీపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పదవీ అన్నది తన ఒక్కడికే దక్కిన గౌరవం కాదని, ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత మిళులకు దక్కిన గౌరవంగా వ్యాఖ్యలు చేశారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించడంలో ప్రత్యేక చొరవ చూపిస్తానని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే గొప్ప దేశంగా ఎదగాలన్న కాంక్షతో ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నాలలో ఉన్నారని వివరించారు. గతంలో ఝార్కండ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాలని ప్రదాని నరేంద్రమోదీ తనకు సూచించారని, దీనిని తాను ఊహించలేదని, ఇది దేవుడిచ్చిన వరంగా భావించినట్టు పేర్కొన్నారు. తమిళనాడు ప్రజల నిరంతర ఆశీస్సులతో ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టానని గుర్తుచేశారు. అనంతరం కోయంబత్తూరులో జరిగిన పలు కార్యక్రమాలను ముగించుకుని తిరుప్పూర్‌కు వెళ్లారు.


