కమనీయం.. మురుగన్ కల్యాణోత్సవం
తిరుత్తణి: స్కంధషష్టి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం మురుగన్ కల్యాణోత్సవం కోలాహలంగా నిర్వహించారు. భారీ వర్షం సైతం లెక్క చేయకుండా భక్తులు కొండ ఆలయానికి చేరుకుని స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. వివరాలు.. తిరుత్తణిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో 22న స్కంధషష్టి వేడుకలు ప్రారంభమయ్యాయి. వారం పాటూ నిర్వహించిన వేడుకల సందర్భంగా రోజూ మూలవర్లకు విశేష అభిషేక ఆరాధన పూజలతో పాటూ ప్రత్యేక అలంకరణతో మహాదీపారాధన చేపట్టారు. కావడి మండపంలో శ్రీవళ్లి, దేవసేన సమేత షణ్ముఖర్‌కు సుగంధ పుష్పాలతో అలంకరించి లక్షార్చన పూజలు జరిగాయి. వేడుకల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం కల్యాణ మురుగన్ కల్యాణోత్సవం నిర్వహించారు. భారీ వర్షం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో భక్తులు కొండ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ నిర్వాహకులతో పాటూ భక్తులు కల్యాణోత్సవానికి సంప్రదాయ పద్ధతిలో పట్టు వస్త్రాలు, పూజా సామాగ్రి, పుష్పాలు, పండ్లు వరుసగా తీసుకొచ్చి కావడి మండపం తీసుకొచ్చారు. ఆలయ ప్రదాన అర్చకుల సమక్షంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కావడి మండపంతో పాటు వెలుపల వేచివున్న భక్తులు హారంహర నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ అధికారులు పసుపు,కుంకుమ. మాంగళ్యం. ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ చైర్మన్ శ్రీధరన్, జాయింట్ కమిషనర్ రమణి ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు సంయుక్తంగా స్కంధషష్టి వేడులకు ఏర్పాట్లు చేశారు.
2026 ఆలయ క్యాలెండర్ విడుదల
తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయ 2026 సంవత్సరం క్యాలెండర్‌ను కొండ ఆలయంలో ట్రస్టు బోర్డు చైర్మన్ శ్రీధరన్ విడుదల చేశారు. మురుగన్ ఫొటోలతో పాటూ ఆధ్యాత్మిక వివరాలతో కూడిన మాసాంత క్యాలెండర్‌ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ. 100 చెల్లించి భక్తులు సుబ్రహ్మణ్యస్వామి ఆలయ క్యాలెండర్‌ను కొనుగోలు చేశారు.
కమనీయం.. మురుగన్ కల్యాణోత్సవం
కమనీయం.. మురుగన్ కల్యాణోత్సవం


