బోస్ వెంకట్ నూతన చిత్రం
ఒప్పంద పత్రాలతో బోస్ వెంకట్, వి.మదియళగన్, యువన్ శంకర్‌రాజా, కన్నన్‌రవి
తమిళసినిమా: ఇంతకుముందు కన్నిమేడం, సార్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన నటుడు బోస్ వెంకట్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం మంగళవారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కేఆర్‌జీ మూవీస్ పతాకంపై కన్నన్‌రవి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎక్స్‌ట్రా ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ అధినేత వి.మదియళగన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గత 35 ఏళ్లుగా దుబాయిలో ప్రముఖ వ్యాపారవేత్తగా రాణిస్తున్న కన్నన్ రవి తన కేఆర్‌జీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న 7వ చిత్రం ఇది కావడం గమనార్హం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు బోస్ వెంకట్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ క్రీడా నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథ ప్రేమ, కుటుంబ అనుబంధాలు, సమాజం వంటి పలు ముఖ్య అంశాల గురించి చర్చించే విధంగా ఉంటుందన్నారు. భారీ బడ్జెట్లో రూపొందిస్తున్న ఈ చిత్రం సినీ పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచి పోతుందన్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. ఈ చిత్రంలో సంగీతదర్శకుడు యువన్ శంకర్‌రాజాతో కలిసి పనిచేయడం సంతోషకరమన్నారు. చిత్రాన్ని త్వరలోనే సెట్‌పైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు బోస్‌వెంకట్ పేర్కొన్నారు.
బోస్ వెంకట్ నూతన చిత్రం


