కుల గణన నిర్వహించాలి
వేలూరు: తమిళనాడులో కుల జనాభా గణన సర్వేలు చేపట్టి వన్నియర్‌లకు న్యాయం చేయాలని పీఎంకే పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్‌కుమార్ అన్నారు. వేలూరులో పీఎంకే పార్టీ యువజన విభాగం సమావేశం జిల్లా అధ్యక్షుడు బాలాజీ అధ్యక్షతన జరిగింది. ఆయన కార్యకర్తలకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ కుల ఆధారిత జనాభా గణన నిర్వహించి అన్ని వర్గాలకు రిజర్వేషన్లను అందజేయాలన్నారు. వేలూరు జిల్లాలోని అనకట్టు నియోజకవర్గంలో అటవీ ప్రాంతవాసులతోపాటు రైతులు అధికంగా వ్యవసాయ పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారని ఆ ప్రాంతంలో శీతల గిడ్డంగి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. పార్టీ మహిళా అధ్యక్షురాలు, వేలూరు కార్పొరేటర్ బాబీ కదిరవన్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి పార్టీలోని యువకులు సైనికుల్లా పని చేయాలన్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోను పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించి అధికంగా పార్టీలో చేర్పించేందుకు కంకణం కట్టుకోవాలన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి వారికి సాయం చేసేందుకు కృషిచేయాలన్నారు. పార్టీలో వర్గ విభేదాలు వదిలి కలిసికట్టుగా పనిచేస్తే పీఎంకే విజయం తథ్యమన్నారు. అనంతరం సమావేశంలో సభ్యులు పది తీర్మానాలను ఆమోదించారు. సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి ఎన్‌టీ షణ్ముగం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశన్, జిల్లా కార్యదర్శి జగన్, రాజేష్‌కుమార్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


