డీఎంకే, కాంగ్రెస్ బంధం దేశానికి రక్ష
సాక్షి, చైన్నె : డీఎంకే, కాంగ్రెస్‌ల బంధం దేశానికి రక్ష అని, దేశాన్ని కచ్చితంగా రక్షించి తీరుతామని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. చైన్నెలోని అన్నా అరివాలయంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ నేత ఇంటి శుభ కార్య వేడుకలో స్టాలిన్ ప్రసంగించారు. డీఎంకే, కాంగ్రెస్‌లు కాలక్రమేనా వేర్వేరు మార్గాలలో ప్రయాణించినప్పటికీ, ప్రస్తుతం దేశ శ్రేయస్సు, సంక్షేమం కోసం ఐక్యతతో సమష్టిగా ముందడుగు వేస్తున్నాయన్నారు. రాహుల్ గాంధీని ఈ సందర్భంగా పొగడ్తలతో ముంచెత్తుతూ, తనను ఎల్లప్పుడూ అన్నయ్యఅని పిలవడం జరుగుతోందన్నారు. ఇది కేవలం రాజకీయ స్నేహం కాదని, ఇది ఒక విధాన పరమైన సంబంధం కూడా అని వ్యాఖ్యలు చేశారు. డీఎంకే, కాంగ్రెస్‌లు కలిసి కట్టుగా ఈదేశాన్ని రక్షించి తీరుతాయని ధీమా వ్యక్తం చేశారు.తమకు దేశ రక్షణే ముఖ్యం అని స్పష్టం చేశారు.
ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకత
తమిళనాడులో ఎస్‌ఐఆర్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంతో డీఎంకే కూటమి తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసింది. చట్టపరంగా దీనిని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే కూటమి పార్టీలు సమావేశానికి నిర్ణయించాయి. ఇదిలా ఉండగా ఎస్‌ఐఆర్‌ను అన్నాడీఎంకే ఆహ్వానించింది. న్యాయబద్ధంగా జరగాలని ఆపార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి కోరారు. ఇక ఎస్‌ఐఆర్‌తో బిహార్‌లో తొలగించిన లక్షలాది ఓట్లను ఇక్కడ(తమిళనాడు)లో చేర్పించే కుట్ర జరుగుతోందని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ధ్వజమెత్తారు.


