క్లుప్తంగా
ఘనంగా మహా కుంభాభిషేకం
వేలూరు: వేలూరు కొత్త బస్టాండ్‌లోని పాలారు నది ఒడ్డున వెలసిన శ్రీఅంకాళ పరమేశ్వరి అమ్మన్ ఆలయ మహా కుంభాభిషేక వైభవం సోమవారం అతి వైభవంగా జరిగింది. ముందగా ఆలయ ప్రాంగణంలో రెండవ కాల యాగ పూజలతో పాటూ గోపూజ, గజ పూజ, లక్ష్మి పూజ, నవగ్రహ పూజ, కలశ పూజలు నిర్వహించారు. యాగ గుండం వద్ద వివిధ పుణిద నదుల నుంచి తీసుకొచ్చిన నీటిని కళశాల్లో ఉంచి వేద పండితుల వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలశ నీటిని ఆలయ రాజ గోపురం వద్దకు తీసుకెల్లి గోపురంపై కలశ నీటిని పోసి కుంభాభిషేక వైభవం నిర్వహించారు. అనంతరం కలశ నీటిని భక్తులపై చల్లారు. అనంతరం ఆలయంలో ఉంచిన అమ్మవారి విగ్రహానికి కలశ నీటిని పోసి పుష్పాలంకరణలు, దీపారాధన పూజలు చేశారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మోహన్, ఆలయ నిర్వహకులు శశికుమార్, ఆనంద్, గణేశన్, సురేష్‌కుమార్, సెంథిల్‌కుమార్, బలరామ్, కార్తీక్ పాల్గొన్నారు.
రైలు ఢీకొని తండ్రీకొడుకు మృతి
వేలూరు: తంజావూరు జిల్లాకు చెందిన రాజేష్(41) ఇతను తిరువలంలోని సున్నపుకారర్ వీధిలో కుటుంబ సభ్యులతో ఉంటూ హోటల్ నడుపుతున్నాడు. ఇతని కుమారుడు కిషోర్ (18) ప్రైవేటు ఇంజినీరింగ్ కళావాలలో విద్యను అభ్యసిస్తున్నాడు. తండ్రి, కొడుకు ఇద్దరూ కాట్పాడి సమీపంలోని తిరువలం వద్ద రైలు రోడ్డు దాటేందుకు యత్నించారు. ఆ సమయంలో అతి వేగంగా వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు ఇద్దరినీ ఢీకొనడంతో తండ్రి, కుమారులు ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదం గురించి రైలు ఇంజిన్ డ్రైవర్ కాట్పాడి రైల్యే పోలీసులకు సమాచారం అందజేయడంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం రైల్యే పోలీసులు కేసు నమోదు చేసి తండ్రి, కుమారుడు ఇద్దరూ రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగిందా..? లేక ఆత్మహత్య చేసుకునేందుకు రైలు ముందుకు వెళ్లారా..? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
ఎలక్ట్రీషియన్ నిజాయితీ
సేలం: సేలం రెడ్డిపట్టి ప్రాంతంలో నివసిస్తున్న భాషా (58) ఎలక్ట్రీషియన్. ఆదివారం రాత్రి తన భార్య పర్వీన్‌తో కలిసి లీ బజార్ ప్రాంతానికి నడుచుకుంటూ వెళుతుండగా వంతెన కింద పడి ఉన్న ఓ హ్యాండ్‌బ్యాగ్‌ను చూశాడు. అందులో బంగారు తాయెత్తు, బ్రాస్‌లెట్, పర్సు, ఏటీఎం కార్డు, పాన్ కార్డు ఉన్నాయి. దీని తరువాత, బ్యాగ్‌ను దాని నిజమైన యజమానికి అప్పగించాలనే ఉద్దేశంతో, సోమవారం ఉదయం, అతని కుమారుడు ఆటో డ్రైవర్ అబ్దుల్లా, బ్యాగ్‌ను సేలం నగర పోలీసు డిప్యూటీ కమిషనర్ సుబ్రమణ్య బాలచంద్రకు అప్పగించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆ ఆభరణాలను నిజమైన యజమానులైన సెహ్వాయిపేట్‌కు చెందిన పూంగోతైకి అప్పగించి, భాషా, అతని భార్య పర్వీన్, అబ్దుల్లాలను అభినందించారు.
చెరువులకు జలకళ
తిరుత్తణి: ఈశాన్య రుతుపవనాలతో చెరువులు వేగంగా నిండుతున్నాయి. తిరుత్తణి సబ్ డివిజన్‌లో నీరు పారుదల శాఖకు చెందిన 79 చెరువులున్నాయి. చెరువునీటిపై ఆధారపడి చాలా మంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు. అలాగే కుశస్థలి నది భూగర్భజలాలపై ఆధారపడి నది తీర ప్రాంతాల రైతులు పంట సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతో గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా చెరువులు వేగంగా నిండుతున్నాయి. తిరుత్తణి డివిజన్‌లో నీటి పారుదల శాఖకు చెందిన 79 చెరువుల్లో 31 చెరువులు పూర్తి సామర్థ్యం నిండాయి. ఇందులో తిరుత్తణిలో 9 చెరువులు, ఆర్కేపేటలో 16, పళ్లిపట్టులో 6 చెరువులు నిండినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని చెరువులు ఒకటి రెండు రోజుల్లో నిండనున్నట్లు తెలిపారు. చెరువులు వేగంగా నిండుతున్న క్రమంలో సాగునీటి ఎద్దడి లేకుండా పంటలకు నీరందే అవకాశం ఏర్పడడంతో రైతులు హర్హం వ్యక్తం చేస్తున్నారు.
క్లుప్తంగా
క్లుప్తంగా


