కాలువల ఆక్రమణలతోనే ఇళ్లలోకి నీరు
వేలూరు: కాలువలు ఆక్రమణలకు గురి కావడంతోనే వరద నీరు ఇళ్లలోకి చేరి విష పురుగుల బాధతో ఇబ్బందులు పడుతున్నట్లు కాట్పాడికి చెందిన కుటుంబ సభ్యులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి,వినతిపత్రం అందజేశారు. సోమవారం వేలూరు కలెక్టరేట్‌లో ప్రజా విన్నపాల దినోత్సవం కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా జిల్లా నలు మూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. కాట్పా డి సమీపంలోని తారాపడవేడు, గోపాలపురం వంటి ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విధంగా తమ ప్రాంతంలో వర్షం వస్తే నీరు వెళ్లేందుకు కాలువ ఉండేదని ప్రస్తుతం ఈ కాలువలను పూర్తిగా ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకోవడంతో నీరు ఇళ్ల మధ్యే నిల్వ ఉంటోందన్నారు. గత రెండు రోజులుగా కార్పొరేషన్ సిబ్బంది సరి చేస్తున్నప్పటికీ నీటిమట్టం తగ్గలేదన్నారు. వీటిపై అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. వినతులను స్వీకరించిన అధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా వినతిపత్రాలు స్వీకరించిన కలెక్టర్ అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మాలతి, సబ్ కలెక్టర్ సెంథిల్‌కుమార్ పాల్గొన్నారు.
కాలువల ఆక్రమణలతోనే ఇళ్లలోకి నీరు


