రోడ్ షోలకు అనుమతి లేదు
కోర్టులో ప్రభుత్వం స్పష్టీకరణ
మార్గదర్శకాల రూపకల్పనకు ఆదేశాలు
భుస్సీ, నిర్మల్ బెయిల్ పిటిషన్ తిరస్కృతి
సీబీఐ సమన్లు
సాక్షి, చైన్నె: మార్గదర్శకాల రూపకల్పన జరిగే వరకు రాష్ట్రంలో ఎలాంటి రోడ్ షోలకు అనుమతి లేదని కోర్టులో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక కరూర్ కేసులో ముందస్తు బెయిల్ కోసం భుస్సీ ఆనంద్, నిర్మల్‌కుమార్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అదే సమయంలో ఈ ఇద్దర్నీ విచారించేందుకు సీబీఐ సమన్లు జారీ చేసినట్టు సమాచారాలు వెలువడ్డాయి. కరూర్ ఘటనతో రోడ్ షోలు, బహిరంగ సభల నిర్వహణకు మార్గదర్శకాల రూపకల్పన దిశగా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన కసరత్తులలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ పరిస్థితులలో సోమవారం మద్రాసు హైకోర్టులో కేసు విచారణకు రాగా, మార్గదర్శకాలకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. కొన్ని పార్టీలకు సభలకు అనుమతి ఇవ్వడం లేదంటూ న్యాయవాదులు వాదించారు. మార్గదర్శకాలను రూపొందించే వరకు ఎలాంటి రోడ్ షోలకు పార్టీలకు అనుమతి ఇవ్వబోమని హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో త్వరితగతిన మార్గదర్శకాల రూపకల్పనకు కోర్టు ఆదేశించింది. అలాగే ముందస్తు బెయిల్ కోసం తమిళగ వెట్రికళగం ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, సంయుక్త కార్యదర్శి నిర్మల్‌కుమార్‌లు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ఆ పిటిషన్ల విచారణను న్యాయమూర్తులు తిరస్కరించారు. అదే సమయంలో కరూర్ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు భుస్సీ ఆనంద్, నిర్మల్‌కుమార్‌ను విచారించేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. వీరికి సమన్లు జారీ చేసి ఉండడం గమనార్హం.


