ఆప్‌స్టేట్ మెడికల్ వర్సిటీతో వీఐటీ ఒప్పందం
వేలూరు: వేలూరు వీఐటీ యూనివర్సిటీ, అమెరికాలోని న్యూయార్క్ సిరిక్యూస్‌లోని ఒక ప్రభుత్వ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్లు వీఐటీ యూనివర్సిటీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకటనలో తెలిపిన విధంగా ఈ ఒప్పందం ఆరోగ్యశాస్త్రాలు, బయోమెడికల్ ఇంజినీరింగ్, మల్టీ డిసిప్లీనరి మెడికల్ కో–ఆపరేషన్ రంగాల్లో విద్య, పరిశోధనల్లో సహకారాన్ని సులభతరం చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఒప్పందంపై సంతకం చేసుకున్నారు. ఈ ఒప్పందంపై ఆప్‌స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ సి.అంబర్గ్, వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు శేఖర్ విశ్వనాథన్ సంతకం చేసుకున్నారు. ఈ ఒప్పందంతో కొత్త కొత్త పరిశోధనలు, అధ్యాపక విద్యార్థుల మార్పిడి ఉద్భవిస్తున్న బయోమెడికల్ రంగాలు, ట్రాన్స్‌లేషనల్ హెల్త్ కేర్ అని పిలువబడే బహుళ విభాగ వైద్య సహకారాలను సులభతరం చేస్తుంది. వీటితో పాటూ వీఐటీలోని వైద్య శాస్త్రాలు, ఇంజినీరింగ్ విభాగాన్ని వైద్య ఇంజినీరింగ్, వైద్య సాంకేతికలతో ప్రపంచ సహకారంలో కీలక పాత్ర వహిస్తుంది. అదేవిధంగా వీఐటీలోని విద్యార్థులు, ఫ్రొఫెసర్‌లు న్యూయార్క్‌లోని యూనివర్సిటీలో పలు పరిశోధనలు చేసేందుకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ఇందులో వీఐటీ యూనివర్సిటీ వైద్య శాస్త్రాలు, ఇంజినీరింగ్ విభాగం డీన్ గీత ఉన్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.


