భక్తులతో తిరుత్తణి కిటకిట
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో స్కంధషష్టి కారణంగా భక్తుల రద్దీ నెలకొంది. మూడు గంటల పాటు క్యూలో భక్తులు వేచివుండి స్వామి దర్శనం చేసుకున్నారు. స్కంధషష్టి వేడుకల్లో ఐదవ రోజైన ఆదివారం మూలవర్లకు వేకువజామున విశిష్ట అభిషేక పూజలు చేసి వెండి ఆభరణాలతో అలంకరించారు. ఉదయం 9 గంటలకు శ్రీవళ్లి, దేవసేన సమేత షణ్ముఖర్‌కు సుగంధ పుష్పాలతో అలంకరించి లక్షార్చన చేశారు. స్కంధషష్టి వేడుకలతో పాటు ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కొండ ఆలయానికి పోటెత్తారు. ఘాట్‌రోడ్డులో వాహనలు క్యూకట్టడంతో వాహన రద్దీ నెలకొంది. సర్వదర్శనానికి మూడు గంటలు, రూ.100 ప్రత్యేక దర్శన మార్గంలో రెండు గంటల పాటు భక్తులు వేచివుండి స్వామిని దర్శించుకున్నారు.
నేడు పుష్పాంజలి
తిరుత్తణి ఆలయంలో స్కంధషష్టి వేడుకల్లో భాగంగా సోమవారం సాయంత్రం స్వామికి పుష్పాంజలి నిర్వహిస్తారు. వివిధ రకాల పుష్పాలు సుమారు ఐదు టన్నులు ఊరేగింపుగా కొండకు తీసుకొచ్చి షణ్ముఖర్‌కు పుష్పాభిషేకం నిర్వహిస్తారు. స్కంధషష్టిలో ప్రధానమైన సూరసంహారం నిర్వహించడం పరిపాటి, అయితే సుబ్రహ్మణ్యస్వామి యుద్ధం పూర్తిచేసుకుని కోపం చల్లారి, శాంతిమయంగా శ్రీవళ్లి, దేవసేనతో తిరుత్తణి కొండపై కొలువుదీరడంతో ఆలయంలో పుష్పాభిషేకం నిర్వహించడం పరిపాటి.
తిరుత్తణి కొండ ఆలయంలో భక్తుల రద్దీ
షణ్ముఖర్‌కు లక్షార్చన
భక్తులతో తిరుత్తణి కిటకిట


