చైన్నెకు కరూర్ బాధితులు
సాక్షి, చైన్నె: కరూర్ బాధిత కుటుంబాలు ఐదు ప్రత్యేక లగ్జరీ బస్సులలో చైన్నెకు ఆదివారం సాయంత్రం బయలుదేరారు. వీరికి మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో బస ఏర్పాటు చేశారు. వీరందర్నీ విజయ్ సోమవారం పరామర్శించనున్నారు. వివరాలు.. కరూర్‌లో టీవీకే నేత విజయ్ గత నెల 27వ తేదిన నిర్వహించిన ప్రచార సమయంలో చోటు చేసుకున్న పెను విషాదం గురించి తెలిసిందే. ఇందులో 41 మంది మరణించగా 160 మంది గాయపడ్డారు. ఈ కుటుంబాలకు విజయ్ పరామర్శించేందుకు నిర్ణయించారు. మరణించిన వారి కుటుంబాలకు పార్టీ తరపున రూ. 20 లక్షలు అందించేందుకు సిద్ధమయ్యారు. అయితే కరూర్‌లో విజయ్ పరామర్శ పర్యటనకు అనేక అడ్డంకులు తప్పలేదు. ఈ కుటుంబాలకు నష్ట పరిహారం అందించడమే కాదు, కుటుంబాలను దత్తత తీసుకునే విధంగా విజయ్ ప్రయత్నాలు చేపట్టారు. కరూర్‌కు వెళ్ల లేని పరిస్థితి నెలకొనడంతో చివరకు చైన్నెకు బాధిత కుటుంబాలను రప్పించేందుకు చర్యలు తీసుకున్నారు.
మహాబలిపురంలో..
ఇందు కోసం మహాబలిపురంలో భారీ వేదికగా రిసార్ట్‌లో ఏర్పాట్లు చేశారు. ఇక్కడ బాధిత కుటుంబాలకు అన్ని రకాల బస ఏర్పాట్లు చేశారు. వీరందర్నీ విజయ్ పరామర్శించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆయా కుటుంబాలతో విజయ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వారి పరిస్థితులను తెలుసుకుని, ఆయా కుటుంబాలను దత్తత తీసుకోనున్నారు. బాధిత కుటుంబాలను కరూర్ నుంచి చైన్నెకు ప్రత్యేక లగ్జరీ బస్సులలో ఆదివారం సాయంత్రం తరలించారు. వీరంతా సోమవారం ఉదయాన్నే చైన్నెలో ఉంటారు. మహాబలిపురం రిసార్ట్‌లో విశ్రాంతి తదుపరి విజయ్ మధ్యాహ్నం లేదా సాయంత్రం పరామర్శించనున్నాని తెలిపారు మృతులు 41 మంది ఉండగా, వీరిలో 33 కుటుంబాలు మాత్రమే చైన్నెకు బయలుదేరాయి. మిగిలిన 8 కుటుంబాలు దూరంగా ఉన్నాయి. గాయపడ్డ వారిలో యాభై మంది చైన్నెకి వస్తుండగా మిగిలిన వారు దూరంగా ఉన్నారు. కాగా విజయ్ తమను కరూర్‌కు వచ్చి పరామర్శించాలని వీరంతా ఆశిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వీరందర్నీ పది బస్సులలో చైన్నెకి తీసుకొస్తున్నారు. ఈ బస్సులకు ప్రత్యేక భద్రతగా విజయ్ ప్రైవేటు సైన్యం వెన్నంటి కదలడం గమనార్హం. కాగా గత నెల 27వ తేదీన కరూర్‌లో ఘటన జరగగా, మూడు రోజుల అనంతరం వీడియో రూపంలో విజయ్ అందరి ముందుకు వచ్చారు. ఆ తర్వాత నాలుగు వారాల తర్వాత ఆయన బయటకు రానున్నారని సమాచారం.


