ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకత
సాక్షి, చైన్నె : ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా డీఎంకే కూటమి పార్టీలు తీవ్రంగా స్పందించాయి. ఈ ప్రక్రియను వీడాలని డిమాండ్ చేశాయి. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. నవంబర్ 4వ తేదీ నుంచి ఇంటింటా ఈ పరిశీలన జరగనున్నది. ఈపరిస్థితుల్లో అన్ని జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు బుధవారం సమావేశమయ్యారు. ఇందులో ఎస్‌ఐఆర్‌కు డీఎంకే, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, నామ్ తమిళర్ కట్చిలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి.
బీజేపీ, అన్నాడీఎంకేలు ఆహ్వానించాయి. ఇక ఆయా రాజకీయ పక్షాల కీలక నేతలతో సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ సాయంత్రం సమావేశమయ్యారు. ఇందులో డీఎంకే తరఫున ఆర్‌ఎస్ భారతీ నేతృత్వంలోని బృందం, అన్నాడీఎంకే తరఫున జయకుమార్ నేతృత్వంలో బృందం, కాంగ్రెస్ తరఫున తంగబాలు నేతృత్వంలోని బృందం, బీజేపీ తరఫున కరాటే త్యాగరాజన్ నేతృత్వంలో బృందం అంటూ, వీసీకే, నామ్ తమిళర్ కట్చి, డీఎండీకే, ఆమ్ ఆద్మీ, తదితర గుర్తింపు పొందిన పార్టీల నాయకులు హాజరయ్యారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను గురించి సమగ్రంగా పార్టీలకు అర్చనా పట్నాయక్ వివరించారు. అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. ఈ సమయంలో డీఎంకే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ తదితర కూటమి పార్టీలన్నీ ఎస్‌ఐఆర్‌కు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి.
ఈ ప్రక్రియను వీడాలని డిమాండ్ చేశాయి. ఇక, బీజేపీ, అన్నాడీఎంకేలు ఈ ప్రక్రియ సక్రమంగా జరిగే రీతిలో చర్యలు తీసుకోవాలని కోరాయి. ఇదిలా ఉండగా ఎస్‌ఐఆర్‌కు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం సైతం వ్యతిరేకతను వ్యక్తం చేయడం గమనార్హం. అదే సమయంలో నవంబర్ 2వ తేదీన ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా జరగనున్న అఖిల పక్ష సమావేశానికి హాజరుకావాలని కోరుతూ డీఎంకే నేత పూచ్చి మురుగన్ పనయూరులో విజయ్‌ను స్వయంగా కలిసి ఆహ్వానం పలకడం విశేషం. కాగా డీఎంకే అఖిల పక్ష సమావేశానికి హాజరయ్యేందుకు నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ నిర్ణయించారు.


